ఉలిక్కిపడ్డ విశాఖ.. కెమికల్ గ్యాస్ ప్రభావంతో మాడిన చెట్లు, మృతి చెందుతున్న మూగజీవాలు

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 04:19 AM IST
ఉలిక్కిపడ్డ విశాఖ.. కెమికల్ గ్యాస్ ప్రభావంతో మాడిన చెట్లు, మృతి చెందుతున్న మూగజీవాలు

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్(lg polymers) పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. కెమికల్ గ్యాస్ వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది.

మూగ జీవాలు మృత్యువాత:
ఇక ఈ గ్యాస్ కారణంగా ప్రజలతో పాటుగా మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. పక్షులు, జంతువులు విలవిలలాడుతున్నాయి. ఊపిరాడక ఐదు గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. పక్షులు, కోళ్లు, కుక్కలు వంటివి ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక గ్రామాల్లో కట్టేసిన పశువుల పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఎల్జీ పాలిమర్స్ లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు సైతం విష వాయువు కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. 

1

తెల్లవారుజామున ప్రమాదం, భారీగా గ్యాస్ లీక్:
గురువారం(మే 7,2020) తెల్లవారు జామున 3.30గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. లీకైన రసాయన గాలి పీల్చడంతో స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రజలు ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి లీక్ అయిన కెమికల్ గ్యాస్ ను స్టైరిన్ (styrene) గా గుర్తించారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్‌ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.

Also Read | విశాఖకు సీఎం జగన్, గ్యాస్ లీక్ బాధితులకు పరామర్శ