Visakha Six Persons Murder : విశాఖ జిల్లాలో ఆరుగురి హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమా?

విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రమణ ఫ్యామిలీ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులంటున్నారు.

Visakha Six Persons Murder : విశాఖ జిల్లాలో ఆరుగురి హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమా?

Visakha six persons murder case

Visakha six persons murder case : విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రమణ ఫ్యామిలీ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులంటున్నారు. గతంలో రమణ కుమారుడు విజయ్, అప్పలరాజు కుమార్తె మధ్య వివాహేతర సంబంధం ఉండేదని… దీంతో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై మూడేళ్ల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అప్పటినుంచి రమణ-అప్పలరాజు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గొడవలతో రమణ కుమారుడు విజయ్‌ విజయవాడకు మకాం మార్చాడు. అయితే అంతటితో ఆగకుండా రమణ ఫ్యామిలీపై కక్ష పెంచుకున్న అప్పలరాజు… అదును చూసి ఆరుగురిని హతమార్చాడు. తెల్లవారుజాము 5 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. దీంతో స్థానికులు అప్పలరాజు దుశ్చర్యను అడ్డుకోలేకపోయారు.

మరోవైపు సంఘటన స్థలంలో క్లూస్‌ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. అయితే ఇద్దరు చిన్నారుల మృతి స్థానికంగా అందర్ని కంటతడి పెట్టిస్తోంది. ఏమైనా కక్షలు ఉంటే పెద్ద వారిపై తీర్చుకోవాలి… కానీ అభంశుభం తెలియని చిన్నారుల్ని పాశవికంగా నరికిచంపడంపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. రమణ కుటుంబంలో ఇప్పుడు కేవలం ఇద్దరే మిగిలారు. రమణ కుమారుడు విజయ్‌… అతని కొడుకు అఖిల్.

రమణ స్వగ్రామం విజయవాడ. విశాఖ జిల్లా జుత్తాడలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ఆయన కుమారుడు విజయ్ విజయవాడలో ఉంటున్నాడు. త్వరలో రమణ చెల్లెలు కూతురు వివాహం ఉండటంతో.. అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. సోమవారం రమణ ఇద్దరు చెల్లెల్లతో పాటు… చెల్లెల్లతో పాటు కోడలు, ఇద్దరు చిన్నపిల్లలు విజయవాడ నుంచి జుత్తాడకు వచ్చారు. నిన్న వైజాగ్‌లో పెళ్లి కోసం షాపింగ్ చేశారు. ఇవాళ విజయనగరం వెళ్లి బంధువులకు పెళ్లికార్డులు పంచనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఈ ఘటన జరిగింది.

ఆరుగురు హత్యకు గురైన ఘటనతో విశాఖ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉదంతం జుత్తాడ గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. ఆరుగురు హత్య ఘటనలో ఆరు నెలల పాప, రెండు నెలల వయసున్న బాబు కూడా ఉండటం స్థానికులను కలచివేస్తోంది. నిందితుడు అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అప్పలరాజును ఉరి తీయాలంటూ జుత్తాడ గ్రామస్తులు, మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.