Visakhapatnam : దేశంలోనే మూడవ స్థానంలో విశాఖ నగరం.. ఎందులో అంటే?

ఏపీ పరిపాలన రాజధానిగా, స్టీల్ సిటీగా గుర్తింపు పొందిన విశాఖపట్నం... మరో ఘనతను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇదంతా విశాఖ ప్రజల వల్లే

Visakhapatnam : దేశంలోనే మూడవ స్థానంలో విశాఖ నగరం.. ఎందులో అంటే?

Visakhapatnam Ranks Third

Visakhapatnam ranks third : ఏపీ పరిపాలన రాజధానిగా, స్టీల్ సిటీగా గుర్తింపు పొందిన విశాఖపట్నం… మరో ఘనతను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇదంతా విశాఖ ప్రజల వల్లే సాధ్యమైంది. వైజాగ్ ప్రజలు తమ నగరాన్ని స్వచ్ఛమైనదిగా నిరూపించడానికి అవసరమైన బాధ్యతను తామే తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో భాగంగా నిర్వహించిన సర్వేలో విశాఖపట్నంను దేశంలోనే మూడో స్థానంలో నిలిపేవిధంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి తమ నగరాన్ని ప్రమోట్ చేసుకున్నారు.

సర్వేలో పెద్ద ఎత్తున పాల్గొన్న పౌరులు:
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి నగరంలోనూ మౌలిక వసతులు, పరిశుభ్రత, ప్రయాణ వసతులు, పారిశుధ్య నిర్వహణ వంటి విషయాల్లో స్థానికంగా ఉండే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. దీనిలో భాగంగా నిర్వహించిన సర్వేలో విశాఖ ప్రజలు ఈ సంవత్సరం వైజాగ్ ను దేశంలోనే మూడో స్థానంలో నిలబెట్టారు. గత సంవత్సరం టాప్ 9 లో ఉన్న విశాఖపట్నం ఈసారి టాప్ 5 లో చోటు సంపాదించింది. జీవీఎంసీ అధికారులు ఈ సర్వేకు సంబంధించి ప్రజల్లో మంచి అవగాహన కల్పించడంతోనే ఇది సాధ్యమైంది.

దేశంలోని 100 సిటీల్లో విశాఖ వాసులే ముందు:
ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ విశాఖపట్నంలో ఈ సర్వే నిర్వహించారు. దీనిలో 31 శాతం మంది విశాఖ ప్రజలు పాల్గొన్నారు. దేశంలోని 100 సిటీల్లో జరిగిన ఈ సర్వేలో అత్యధికంగా ప్రజలు పాల్గొన్నది కూడా విశాఖపట్నం నుంచే కావడం గమనార్హం. దీంతో దేశంలోనే మూడో స్థానంలో విశాఖ నగరం నిలిచినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వైజాగ్ మినహా ఆంధప్రదేశ్ లోని ఇతర నగరాలు ఏవీ కూడా టాప్ 10 లో చోటు సంపాదించలేకపోయాయి.

విశాఖపట్నం నగరం ఈ స్థాయికి చేరడం పట్ల జీవీఎంసీ కమిషనర్ సృజన, అడిషనల్ కమిషనర్, స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సన్యాసిరావు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో పాలుపంచుకోవడం ద్వారా ప్రజలు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.