జగన్ మైండ్ గేమ్, డైలమాలో విశాఖ తెలుగుదేశం ఎమ్మెల్యేలు

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 10:52 AM IST
జగన్ మైండ్ గేమ్, డైలమాలో విశాఖ తెలుగుదేశం ఎమ్మెల్యేలు

విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూరల్ జిల్లాలో ఉన్న నేతలను కేసులు వెంటాడుతుండటంతో అసలు బయటకే రావడం లేదట. ఇక సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కాస్త ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారనుకుంటుంటే, దగ్గరుండి టీడీపీ అధిష్టానమే వారిని దూరం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విశాఖ జిల్లాలో, రూరల్ జిల్లాలో సీనియర్లు అయిన అయ్యన్నపాత్రుడు, పప్పల చలపతిరావు వంటి వారు అనారోగ్య కారణాలతో అంత యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కాస్తా కూస్తో యాక్టివ్‌గా ఉన్న అనిత లాంటి నేతలు రాష్ర్ట బాధ్యతలు దృష్ట్యా అక్కడే ఉంటున్నారు.

టీడీపీ నేతలను అత్మరక్షణలోకి నెట్టిన ప్రభుత్వం:
సిటీలో నలుగురు ఎమ్మెల్యేలున్నా… ఎవరికి వారుగానే ఉంటున్నారట. ఇటీవల వరకూ వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపుడి రామకృష్ణ బాబు, గణబాబు వంటి నేతలు వారి వారి నియోజకవర్గ సమస్యలతో పాటు అధిష్టానం ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందించేవారు. ఒక్క గంటా శ్రీనివాసరావు తప్ప మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పరిధిలో కార్యక్రమాలు కూడా బాగానే చేసుకుంటూ వచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పాలనా రాజధానిగా విశాఖ అంశం తెర మీదకు తెచ్చి ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి విశాఖ నగరంలో ఉన్న టీడీపీ నేతలను అత్మరక్షణలోకి నెట్టింది వైసీపీ ప్రభుత్వం.


అధిష్టానం డబుల్ గేమ్ తో టీడీపీ ఎమ్మెల్యేలకు మనశ్శాంతి కరువు:
మీడియా ముందు కానీ, ఆఫ్ ద రికార్డ్ సమావేశాల్లో కానీ విశాఖతో పాటుగా ఇతర ప్రాంతాల అభివృద్ధి కూడా చేయాలని చెబుతూ వచ్చారు. తెలుగుదేశం అధిష్టానం డబుల్ గేమ్‌తో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు మనశ్శాంతి లేకుండా పోయిందట. ఇప్పటికే టీడీపీ అమరావతికి అనుకూలంగా స్టాండ్ తీసుకుంది. దమ్ముంటే విశాఖ నగర పరిధిలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చెయించగలరా అని వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఈ విషయంలో నొప్పించక తానొవ్వక అన్న రీతిలో విశాఖ నగర పరిధిలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ వచ్చారు.

అలజడి రేపిన వాసుపల్లి గణేశ్‌ కుమార్ పేరుతో లేఖ:
టీడీపీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీ సిటీ ఎమ్మెల్యేలు బాగా ఇబ్బంది పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీ అనుసరించిన వైఖరితో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గణబాబు తీవ్ర మనస్తాపం చెందారని అంటున్నారు. తాజాగా విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దని, ఇక్కడ భూ అక్రమణలు పెరిగాయని వాసుపల్లి గణేశ్‌ కుమార్ పేరుతో ఓ లేఖ విడుదల కావడం పెద్ద అలజడి రేపింది. ఆయనకు తెలియకుండానే తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆ లేఖ విడుదల కావడంతో ఆయన కూడా ఆగ్రహంగా ఉన్నారట.


బయట తిరగలేని పరిస్థితి:
విశాఖను పాలనా రాజధానిగా పార్టీ వ్యతిరేకిస్తుండటంతో బయట తిరగలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ పేర్లతో, తమకు తెలియకుండా లేఖలను విడుదల చేయడంపై ఎమ్మెల్యేలు గరం గరం అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే పొమ్మనకుండా పొగ పెడుతున్నట్లుగా ఉందంటూ లోలోపల రగిలిపోతున్నారట. ఇప్పటికే టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ మెల్లగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా నేతలకు మార్గనిర్దేశనం చేయాల్సిన అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో తమ దారి తాము చూసుకోవాలనే ఆలోచనలో మరికొందరు నేతలున్నారని చెబుతున్నారు.