ఆ బ్యాగ్‌లో ఏముంది? సీబీఐ విచారణ..హాజరైన వివేకా కూతురు సునీత

  • Edited By: madhu , July 31, 2020 / 01:33 PM IST
ఆ బ్యాగ్‌లో ఏముంది?  సీబీఐ విచారణ..హాజరైన వివేకా కూతురు సునీత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.విచారణకు హాజరయ్యే సమయంలో సునీత తీసుకెళ్తున్న బ్యాగు మరింత ఉత్కంఠ రేపుతోంది. అసలు ఆ బ్యాగులో ఏమున్నాయనేది సస్పెన్స్‌గా మారింది. వివేకా హత్య కేసుకు సంబంధించి అనుమానితుల వివరాలన్నీ సునీత.. సీబీఐకి అప్పగించినట్లు సమాచారం.

ఇందులో కీలక వ్యక్తుల పేర్లు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వారిని కూడా విచారించేందుకు సీబీఐ బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక వివేకా ఇంట్లో పనిచేసే వంటమనిషి లక్ష్మీదేవి కూడా శుక్రవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. గురువారం సునీతతో కలిసి లక్ష్మీదేవిని విచారించిన అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.అలాగే ఆమె కుమారుడు ప్రకాశ్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు. వారితో పాటు ఘటనా సమయంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన శంకరయ్యను కూడా సీబీఐ విచారించింది. ఆ సమయంలో ఏం జరిగిందనే దానిపై సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు తెలుస్తోంది.