వైజాగ్‌కు కరోనా ముప్పు.. ఎదుర్కొగలదా?

  • Published By: sreehari ,Published On : February 4, 2020 / 01:21 PM IST
వైజాగ్‌కు కరోనా ముప్పు.. ఎదుర్కొగలదా?

చైనాలో కరోనావైరస్ (nCoV) వుహాన్ సిటీలో ఉద్భవించి భారత్ సహా ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఎలాంటి మెడిసన్, వ్యాక్సీన్ అందుబాటులో లేని ఈ వైరస్ ను నివారించడం వైద్యరంగానికి పెద్ద సవాలుగా మారింది. వైరస్ సోకిన వారి లక్షణాలను గుర్తించడం వారిని అందరికి దూరంగా ఉంచి రోగ లక్షణాలను బట్టి చికిత్స అందించడం ఒక్కటే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం. ప్రపంచ దేశాల్లో నుంచి భారత్ లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించేందనే వార్తలు వస్తున్నాయి. 

కొంతమందికి ఈ కరోనా లక్షణాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికార యంత్రాంగం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా కరోనా భయం పట్టుకుంది. విదేశాల నుంచి రాకపోకలు సాగించే వైజాగ్ అంతర్జాతీయ విమానశ్రయంతో పాటు ఒక ప్రైవేటు ఓడరేవుతో కలిపి రెండు ప్రధాన ఓడరేవులకు వైరస్ ముప్పు పొంచి ఉంది. అయితే అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం వైజాగ్ వరకు సోకితే.. దాని ప్రభావాన్ని అడ్డుకోవాడానికి వైద్యపరంగా వైజాగ్ రెడీగా ఉందా? ఎలాంటి తక్షణ ఏర్పాట్లు చేస్తుంది ఎలా ఎదుర్కోగలదు అనే ప్రశ్న తలెత్తుతోంది.

తగిన ఏర్పాట్లు :
కరోనా వైరస్ అడ్డుకోవడానికి తక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అవి తాత్కాలికమైనవి మాత్రమే.. కరోనా వ్యాప్తి చెందితే అవి సరిపోవు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఐసోలేషన్ వార్డులను పరిమిత సంఖ్యలో పడకలతో కేటాయించారు. అయితే అలాంటి సంఘటనలను నిర్వహించడానికి దీర్ఘకాలిక స్థిరమైన ప్రణాళిక అవసరం అని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి.వి.రావు అన్నారు.

ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో తాత్కాలిక వార్డులను ఏర్పాటు చేయడం సరిపోదు. అవసరమైనది శాశ్వత ఐసోలేషన్ వార్డ్,  శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన ఆస్పత్రి ఉండాలని డాక్టర్ రావు చెప్పారు. శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బంది ఉండాలన్నారు. పుణెలో మాదిరిగానే విశాఖపట్నంలో కూడా కనీసం ఒక వైరాలజీ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పరిశోధన, అధ్యయన కేంద్రంగా మార్చవచ్చని డాక్టర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు.

వైద్యపరమైన చర్యలు :
జనవరి 30 న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్కానర్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ తెరిచారు. దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీళ్లు కారడం, జ్వరం వంటి లక్షణాలతో అంతర్జాతీయ ప్రయాణికులందరినీ వైద్యులు పరీక్షించారు. ‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులను తెరిచారు. ఈ ఆస్పత్రుల్లో ప్రతిదానిలో nCoVకి నోడల్ ఆఫీసర్‌గా ఒక వైద్యుడిని నియమించారు.

ఆంధ్రా మెడికల్ కాలేజీ (AMC), మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ కె. రాంబాబు, వ్యాధి వ్యాప్తిని తనిఖీ చేయడానికి రాష్ట్ర నోడల్ అధికారిగా ఒకరిని నియమించారు. N95 మాస్క్‌లు, ప్రొటెక్టీవ్ సూట్లు, కళ్లజోళ్లు డిస్పోజల్ కిట్‌లతో సహా అవసరమైన అన్ని ప్రాథమిక పరీక్షలు  భద్రతా పరికరాలు ఉన్నాయి. విదేశీ తీరాల నుండి వచ్చే సిబ్బంది ముప్పును దృష్టిలో ఉంచుకుని ఓడరేవు దగ్గర ఐసోలేషన్ వార్డ్ ఓపెన్ చేశారని ’అని డాక్టర్ రాంబాబు చెప్పారు. 

 నిఘాలో విమానాశ్రయం :
నగర విమానాశ్రయంలోని ప్రయాణీకులకు సెల్ఫ్-రిపోర్టింగ్ ఫారాలు అందజేస్తున్నారు. దీనిలో వారు చైనాను సందర్శించారా, ముఖ్యంగా వుహాన్, లేదా విదేశాలకు వెళ్ళేటప్పుడు చైనా పౌరులతో సంబంధాలు పెట్టుకున్నారా అనే ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.

ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద వివరాలను తీసుకుంటారు. వైద్యుల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందోని విమానాశ్రయం డైరెక్టర్ ఎం. రాజా కిషోర్ తెలిపారు. అనుమానాస్పద ప్రయాణీకులు ఎవరైనా విమానాశ్రయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడి వద్దకు రావాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి.