విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు : కేంద్రం ఏం చెప్పిందంటే

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్‌ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది కేంద్రం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు : కేంద్రం ఏం చెప్పిందంటే

Nirmala

vizag steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం…. ప్లాంట్‌ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ… అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది కేంద్రం.. మొదటి నుంచి చెపుతున్నట్టుగానే విశాఖ ప్రైవేట్‌ ప్లాంట్‌పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం పరోక్షంగా తేల్చేసింది.. పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన చేసింది.. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గిడ్డి మాధవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నలకు… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కోసమే స్లీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ ప్రకటించి.. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే వెళుతున్నట్టు చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భారత ప్రభుత్వం 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించిందని… జనవరి 27, 2021న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ దీనికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు… అంతేగాకుండా విశాఖ స్టీల్‌కు చెందిన ఇతర అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థల నుంచి కూడా ప్రైవేటైజేషన్ ద్వారా పెట్టుబడులను ఉపసంహరిస్తామన్నారు. భారత ప్రభుత్వ పెట్టుబడులను వ్యూహాత్మకంగా ఉపసంహరించడం వల్ల మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చన్నారు.. దీని వల్ల అధిక ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించవచ్చని తెలిపారు.

వ్యూహాత్మక అమ్మకంలోని నియమ నిబంధనలను నిర్ణయించేటప్పుడు, ప్రస్తుత ఉద్యోగులు, ఇతర భాగస్వామ్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.. షేర్ పర్చేస్‌ అగ్రిమెంట్‌లో అవసరమైన షరతులను చేర్చడం ద్వారా దీనిని పరిష్కరిస్తామన్నారు నిర్మల. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని తేల్చేసింది… అయినప్పటికీ, ప్రత్యేకమైన అంశాల్లో అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామంది.
లోక్‌సభలో నిర్మలమ్మ ప్రకటనతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటైజేషన్‌పై వెనక్కి తగ్గేది లేదని చెప్పకనే చెప్పేసింది.

మొదటి నుంచి ప్రైవేటైజేషన్‌పై కేంద్రం ఒకే వైఖరితో ఉంది.. గతంలో ప్రధాని మోదీ కూడా వ్యూహాత్మక రంగాలను మినహాయించి.. మిగిలిన అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించారు.. ప్రభుత్వం పాలిస్తుంది కానీ.. వ్యాపారాలు చేయవని చెప్పారు.. దీనికి అనుగుణంగానే కేంద్రం ముందుకు వెళుతోంది. మరోవైపు స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఏపీలో ఉద్యమం ఉధృతమవుతోంది.. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ సమయంలో కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించిందని చెప్పాలి.