Steel Plant Politics: హస్తినకు తాకిన స్టీల్‌ ప్లాంట్‌ సెగ.. మహాధర్నాలో విజయసాయిరెడ్డి

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.

10TV Telugu News

Steel Plant Politics: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయ్‌. అటు కేంద్రం మాత్రం ప్రైవేటీకరణను ఆపలేమని మరోసారి స్పష్టం చేస్తోంది. మరి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏపీలో అధికార, విపక్షాలు ఉమ్మడిపోరు చేస్తాయా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు హోరెత్తుతున్నాయ్‌. జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఆందోళనలు చేపట్టారు కార్మికులు. స్పాట్..

కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ ఎంపీలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని తెలిపారు. ఎన్నో పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు విజయసాయిరెడ్డి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ప్రాణాలను కాపాడింది అని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పటికీ నెలకు రెండు వందల కోట్ల రూపాయల లాభంతో ఉక్కు పరిశ్రమ నడుస్తోందని స్పష్టం చేశారు.

ఆందోళన చేస్తున్న కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని తెలిపారు ఎంపీలు కనకమేడల రవీందర్ కుమార్, గల్లా జయదేవ్. విశాఖ స్టిల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు గల్లా. స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక.. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై.. ఎంపీలు సజ్దా అహ్మద్‌ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది కేంద్రం. ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది కేంద్రం.

10TV Telugu News