మళ్లీ చిగురిస్తున్న విశాఖ పర్యాటక ఆశలు

  • Published By: Subhan ,Published On : June 26, 2020 / 12:58 PM IST
మళ్లీ చిగురిస్తున్న విశాఖ పర్యాటక ఆశలు

విశాఖ అంటేనే పర్యాటక రంగానికి పెట్టింది పేరు. కేవలం ఏపీ నుంచే కాదు.. అన్ని రాష్ట్రాల నుంచి పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. ఇక విదేశీయులు సైతం.. విశాఖను విజిట్‌ చేసి వెళ్తారు. పర్యాటకంగా విశాఖకు అంత పేరు ఉంది. అరకు, అనంతగిరి, లంబసింగిలాంటి కూల్‌ ప్రదేశాలు ఉన్నాయి. అంతేకాదు..  విశాఖలోని రుషికొండ, అప్పుఘర్‌  ప్రాంతాల్లో లాడ్జీలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఆకట్టుకుంటాయి. ఇక బొర్రా గుహల అందాలు కట్టిపడేస్తాయి.  

పర్యాటకరంగం ద్వారా  ప్రభుత్వానికి నెలకు రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే వేసవి సీజన్‌ అయితే… మరో కోటి రూపాయలు అదనంగా వస్తుంది. టూరిజం బోట్ల ద్వారా సంవత్సరానికి 30 వేల నుంచి 40వేల మంది బోటింగ్‌ చేసేవారు. దీని ద్వారా  4 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కరోనా దెబ్బతో సరిగ్గా వేసవి సీజన్‌లో మూడు నెలలపాటు టూరిజం కార్యకలాపాలే లేకుండా పోయాయి. అన్నీ నిలిచిపోవడంతో సుమారు 10కోట్ల నష్టం వాటిల్లింది. 

కరోనా కారణంగా అన్నీ మూతపడడంతో పర్యాటకరంగం భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా పర్యాటక సంస్థ ఆదాయంలో అరకు ప్యాకేజీ శాతం ఎక్కువ. కేకే లైన్‌లో నడిచే కిరండోల్‌ పాసింజర్‌ అరకుకు పర్యాటకులను తీసుకువెళ్తుంది. లాక్‌డౌన్‌ కారణంగా దానిని పూర్తిగా నిలిపివేశారు. ఇటీవలే పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌… ఆ రైలును పునరుద్ధరించాలని కోరారు. అయితే  వర్షాలు పడుతుండడంతో రైలు ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడుతున్నాయి.  దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. అందుకే కిరండోల్‌ పాసింజర్‌ పునరుద్దరణ ఆలోచనను అధికారులు కొద్దిరోజులు పక్కనపెట్టారు. 

పర్యాటకరంగం ఈ సంవత్సరం కొలుకునే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. 2021లోనే కాస్తా పుంజుకోనే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని పర్యాటకులతోనే పర్యాటకరంగం నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి టూరిస్టులు ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.

జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వం హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుని అన్నింటినీ తెరిచారు. అయితే  పర్యాటకులు మాత్రం ధైర్యం చేసి ముందుకురావడం లేదు. ప్రతిచోట కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో సరదాగా బయటకు వెళ్లాలనే కోరికను చంపేసుకుంటున్నారు. దాంతో అన్నీ వెలవెలబోతున్నాయి. రుషికొండ, అప్పుఘర్‌  ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో టేక్‌ అవే పేరుతో ఫుడ్‌ పార్శిల్‌ కౌంటర్లు ఏర్పాటుచేశారు. 

ఎవరైనా వచ్చి నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకు అన్నీ సిద్ధంచేశారు. అయినా కస్టమర్స్‌ మాత్రం తక్కువగానే ఉన్నారు. పర్యాటక రంగం కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని పర్యాటకశాఖ అదికారులు చెబుతున్నారు. అప్పటి వరకు పర్యాటకరంగం పరిస్థితిలో మార్పు పెద్దగా ఉండబోదు.