విజయనగరం కొత్త మూడు లాంతర్లకు పాత పేరు వచ్చేనా..

  • Published By: Subhan ,Published On : June 26, 2020 / 12:46 PM IST
విజయనగరం కొత్త మూడు లాంతర్లకు పాత పేరు వచ్చేనా..

విజయనగరం జిల్లా కేంద్రంలో మూడు ప్రధాన రహదారులు కలిసే ప్రాంతంలో ఉండే ప్రాచీన కట్టడమైన మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడం నాడు వివాదంగా మారింది. ఈ చారిత్రక కట్టడాన్ని ఆధ్యాత్మిక చిహ్నంగా కూడా కొలుస్తారు. పూర్వం రాజుల కాలంలో విద్యుత్‌ వెలుగులు లేని రోజుల్లో ఈ స్తంభాన్ని నిర్మించారు. విజయనగరం మీదుగా రాకపోకలు సాగించే బాటసారులకు, ఎడ్ల బండ్లకు దారి చూపించేలా ఈ మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. 

మూడు దిశలా కనిపించేలా ఏర్పాటు చేసిన మూడు హరికేన్‌ లాంతర్లు అప్పటి నుంచే సేవలు అందిస్తున్నాయి. మూడు లాంతర్ల నిర్మాణం కారణంగానే మూడు రోడ్ల కూడలికి మూడు లాంతర్ల జంక్షన్ అని పేరొచ్చింది. సాహితీవేత్తలు, కవులు, కళాకారులు…సాయంత్రం సమయంలో మూడు లాంతర్ల స్తంభం వద్దకు చేరుకొని, చర్చా గోష్టిలు నిర్వహించుకునేవారని ప్రతీతి.

మే 22వ తేదీ రాత్రి నుంచి ఈ చారిత్రక స్తంభాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అధికారుల తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. చారిత్రక చిహ్నాన్ని కూల్చివేయడం దారుణమంటూ విమర్శలు గుప్పించాయి. 

ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో….  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ స్థూప నిర్మాణం చేపట్టారు. కూలగొట్టిన రెండు రోజుల్లోనే మూడు లాంతర్ల స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాదు..  నెల రోజుల్లో పూర్తి చేయిస్తానంటూ హామీ ఇచ్చారు.  అన్నట్టుగానే సరిగ్గా నెల రోజుల్లో కొత్త స్థూపం నిర్మాణం పూర్తయ్యింది. 24న ఈ స్థూపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 20లక్షల రూపాయల వ్యయంతో, 20 అడుగుల ఎత్తులో కొత్త స్థూపాన్ని  నిర్మించారు.  

గతంలో ఉన్న చారిత్రక స్థూపానికి, ప్రస్తుతం కొత్తగా నిర్మించిన స్థూపానికి ఎక్కడా పోలిక లేదు. జాతీయ భావం పెంపొందించే విధంగా దేశ నాయకులైన గాంధీ, నెహ్రూ, వల్లాభాయ్ పటేల్ ప్రతిమలు, వాటిపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం కీర్తిని చాటిచెప్పే జానపద కళారూపాలను విద్యుత్ దీపాలంకరణ మధ్యలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్థూపం వలన పట్టణానికి సరికొత్త శోభ వచ్చిందని, ఎంతో ఆకర్షణీయంగా ఉందంటూ కొంతమంది నగర పెద్దలు కొనియాడుతున్నారు. 

కొత్తగా నిర్మించిన మూడు లాంతర్ల స్థూపంపై కొంతమంది సిటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త స్థూపంతో హంగు, ఆర్భాటం తప్ప, గతించిన చరిత్ర తిరిగి రాదంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్థూపం పూర్తిగా ఫైబర్‌తో తయారు చేశారు. ఆర్టిఫిషియల్‌గా ఎక్కడో తయారు చేసి, ఉన్నఫలంగా తీసుకొచ్చి నిలబెట్టారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ స్థూపం తట్టుకుంటుందా అన్నది మాత్రం ఎవరూ గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు.