బాబుకు సలహాదారులు కావలెను

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 02:18 PM IST
బాబుకు సలహాదారులు కావలెను

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సరైన సలహాలిచ్చే వారు కావాలంటున్నారు. ఒకానొక దశలో దేశ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి సలహాలిచ్చే వారి కోసం చూడడం విడ్డూరమే. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ తర్వాత చంద్రబాబుకి ప్రధానిగా అవకాశం వచ్చిందని చెబుతారు టీడీపీ నేతలు. అలాంటి చంద్రబాబు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో తన సత్తా చూపించారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆనాడు వైఎస్‌ను ఢీకొట్టిన చంద్రబాబు నేడు ఆయన కుమారుడు జగన్‌తో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయిన టీడీపీ.. ఏపీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 1980 దశకంలో దేశంలోనే ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు దాదాపు తెరమరుగయ్యారు. ఒక్క చంద్రబాబు మాత్రమే క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అయినా టీడీపీ నేతలు మాత్రం దీనికి రకరకాల కారణాలు చెబుతుంటారు. రాష్ట్ర విభజన టీడీపీకి ప్రధాన అవరోధంగా మారిందని, పార్టీ ఈనాటి పరిస్థితికి అదే కారణమని చాలా మంది టీడీపీ నేతల ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేకమంది నేతల సలహాలు, సూచనలతో చంద్రబాబు పార్టీని నడిపించేవారు. ఆ విధంగా అనేక సందర్భాల్లో వివిధ ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ గట్టెక్కిందంటారు. గతంలో చంద్రబాబుకు అనేక మంది సీనియర్లు సలహాలు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఎందుకూ అక్కరకు రాని సలహాలిచ్చే వారే బాబు చుట్టూ ఉంటున్నారని పార్టీలో కొందరు నేతలు గుసగుసలాడుకుంటునర్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా అప్పట్లో కేసీఆర్‌ కొంతకాలం చంద్రబాబుకి సలహాలు ఇచ్చేవారు. ఆ తర్వాత  మాధవ రెడ్డి, దేవేంద్రగౌడ్, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలిముద్దుకృష్ణమ నాయుడు, ఎర్రంన్నాయుడు, లాల్ జాన్ బాషా, కోడెల శివప్రసాదరావు, బీవీ మోహన్ రెడ్డి.. ఇలా చాలా మంది నేతలే చంద్రబాబుకు అండగా ఉండే వారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరితో చర్చించే బాబు నిర్ణయం తీసుకునేవారు. పైన చెప్పిన వారిలో చాలా మంది తెలంగాణ నేతలే ఉన్నారు. వీరిలో కొందరు నేతలు మరణిస్తే, మరికొందరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న టీడీపీకి ఆ స్థాయి సలహాలిచ్చే నేతలు కరువయ్యారు. ఒక యనమల మాత్రమే అధినేతకు సలహాలిచ్చే పరిస్థితి ఉంది. కాలానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకుపోయేలా నిర్ణయాలు తీసుకునేందుకు  తమ అధినేతకు మంచి సలహాదారులు కావాల్సిందే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు  కొత్త సలహాదారులని రంగంలోకి దింపుతారో లేదో చూడాల్సిందే.

Read More : ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు