విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ షాడో టీంలు.. టీడీపీ సక్సెస్ అయినట్లేనా..

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ షాడో టీంలు.. టీడీపీ సక్సెస్ అయినట్లేనా..

వైసీపీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో మంచి యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. బాణాల్లా తగిలే మాటలతో వ్యంగ్యాన్ని జోడిస్తూ చిన్న చిన్న పదాలతోనే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశాల కన్నా ఆయన పెట్టే ట్వీట్లే సంచలనాలకు మారు పేరుగా ఉంటాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆయన పెట్టే ట్వీట్లకు అవతల నుంచి సమాధానం కూడా వచ్చేది కాదు. రాజకీయంగా జరగబోయే పరిణామాలను కూడా ట్వీట్ల ద్వారానే ముందుగా హింట్ ఇస్తారు విజయసాయిరెడ్డి.

ఒకరకంగా ప్రతిపక్ష పార్టీని ట్వీట్ల ద్వారానే వెంటాడేస్తారు. విజయసాయిరెడ్డి ట్వీట్ల దెబ్బకు టీడీపీ నేతలు ఏం చేయాలని ఆలోచించి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం ఇద్దరు, ముగ్గురు నేతలతో ఓ షాడో టీమ్‌ని ఏర్పాటు చేసిందంట. విజయసాయిరెడ్డి టీడీపీని విమర్శిస్తూ ట్వీట్ పెట్టగానే వెంటనే షాడో టీంలు రంగంలోకి దిగుతాయి. ఆ వెంటనే ఆయనకు కౌంటర్ గా రెండు లేదా మూడు ట్వీట్లను వదులుతాయి. కొంతకాలం నుంచి ఇదే విధానాన్ని టీడీపీ నేతలు ఫాలో అవుతున్నారట.

ఈ విధంగా కౌంటర్ అటాక్ చేయడం వల్ల కొంత ప్రయోజనం కలిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రజల్లో బాగా ప్రభావం చూపుతున్నాయని, వాటిని సైలెంట్‌గా వదిలేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని, అందువల్లనే ఈ షాడోల ద్వారా కట్టడి చేస్తున్నామని చెబుతున్నారు టీడీపీ నేతలు.

సార్వత్రిక ఎన్నికల ముందు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని విజయసాయిరెడ్డి టీడీపీని బాగా దెబ్బ కొట్టారని భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ షాడో టీంలా ఉంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ రాగానే వెంటనే చెరో ట్వీట్ పెడుతున్నారు. వీరిద్దరినీ పార్టీ పెట్టడానికి ఒక కారణం కూడా ఉందట.

పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి విజయసాయిరెడ్డి అంటే ఒంటికాలి మీద లేస్తారు బుద్ధా వెంకన్న. అదే విధంగా వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటే విశాఖ జిల్లా కి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కరెక్ట్ అని టీడీపీ భావించిందట. మరికొంతమంది నేతలను పార్టీ సంప్రదించినప్పుడు సైలెంట్‌గా తప్పించుకున్నట్లు సమాచారం.

బుద్ధా వెంకన్న, అయ్యన్నపాత్రుడు మాత్రం పార్టీ కోసం ధైర్యంగా నిలబడతామని హైకమాండ్‌కి హామీ ఇచ్చారని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది పదవులు అనుభవించి పత్తా లేకుండా పోయిన వీరన్నా గట్టిగా పార్టీ కోసం నిలబడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ షాడో టీమ్‌ ద్వారా కొంతవరకు విజయసాయిరెడ్డిని కట్టడి చేయగలిగామని, ఆయనకు గట్టి కౌంటర్లు పడుతున్నాయని సంబరపడిపోతున్నాయి ఎన్టీఆర్ భవన్ వర్గాలు. విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ట్వీట్లు చేయడం.. వాటిని ఈ టీమ్‌ తిప్పికొడుతుండడంతో టీడీపీ వర్గాల్లో కొత్త జోష్‌ వచ్చిందంటున్నారు.