ఐసీయూలో ఏలూరు !… ట్యాంకు నీళ్లే కొంప ముంచాయా ?

  • Published By: murthy ,Published On : December 8, 2020 / 12:24 PM IST
ఐసీయూలో ఏలూరు !… ట్యాంకు నీళ్లే కొంప ముంచాయా ?

water contamination is the reason of eluru mysterious disease :  పశ్చిగోదావరి జిల్లా ఏలూరులో మున్సిపల్ ట్యాంక్ నీళ్లే కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏలూరులో నీటి శాంపిల్స్‌ను IICT, CSIR-NGRI పరీక్షించాయి. నీళ్లలో అధిక మోతాదులో క్లోరైన్, పాస్పైట్ పెస్టిసైడ్స్ ఉన్నట్లు గుర్తించాయి.

వాటర్ ట్యాంక్ సమీపంలోని పొలాల్లో ఎక్కువగా పాస్పైట్ పెస్టిసైడ్స్ వాడి ఉంటారని అది నీటిలో కలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. ప్రజలు ఉన్నట్టుండి పడిపోవడంపై ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీ నివేదికలు ఇచ్చాయి. ఏలూరులో పరిస్థితికి లెడ్‌, నికెల్ కారణమని తేల్చాయి. బాధితుల రక్తంలో అధిక మోతాదులో లెడ్ హెవీమెటల్, నికెల్ ఉన్నట్లు స్పష్టం చేశాయి. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదట్నుంచి మంత్రి ఆళ్ల నాని దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.



బాధితుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. స్థానికంగా జరిపిన పరీక్షల్లో ఎటువంటి ఫలితాలు రాకపోవడంతో.. మంగళగిరి ఎయిమ్స్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపారు. ఏలూరులో పరిస్థితికి లెడ్ హెవీ మెటల్, నికెల్ కారణమని ఎయిమ్స్ వైద్యులు నివేదిక విడుదల చేశారు. బాధితుల రక్తంలో లెడ్, నికెల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిన్ లక్షణాలు కనిపిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. లెడ్ అనేది బ్యాటరీల్లో ఉండే రసాయనం. ఇది తాగునీరు లేదా పాల ద్వారా బాధితుల శరీరంలోకి వెళ్లి ఉంటాయని అంచనా వేశారు. వైద్యుల నివేదికలోని వివరాలను ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. శాంపిల్స్‌ టెస్టుల వివరాలను మంగళగిరిలోని ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు.



బాధితుల శరీరాల్లోకి లెడ్‌ ఎలా వెళ్లిందనే అంశంపై.. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలుసుకోవాలని సూచించారు. నీళ్లు, వాటర్‌ శాంపిల్స్‌ను పంపించాలని ఎయిమ్స్‌ వైద్యులు.. ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలని జీవీఎల్‌ కోరారు. అటు ఐఐసీటీ కూడా పలు విషయాలు వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లాలో సరఫరా అవుతున్న నీటిలో ఎక్కువగా బ్లీచింగ్ వాడకం, పంట పొలాల్లో క్లోరో పాస్పైట్ పెస్టిసైడ్స్ వాడకం వల్ల ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నట్లు నివేదికలో పేర్కొంది.

పనిచేస్తున్న వారు, గుడికి వెళ్లినవారు, ఇంట్లోవారితో మాట్లాడుతున్నవారు సడన్‌గా ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోతున్నారు. నాలుగు రోజులుగా ఏలూరులో ఇదే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరు చూస్తుండగానే కళ్లముందే ఫిట్స్ వచ్చినట్లు పడిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకు 502మంది ఆస్పత్రుల్లో చేరారు. గంటగంటకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో 332మందిని డిశ్చార్జ్‌ చేయగా…. 153మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు.



ఇప్పటిదాకా ఏలూరును వణికించిన ఈ అంతుచిక్కని మహమ్మారి… చుట్టు పక్కల ప్రాంతాలకూ విస్తరిస్తోంది. దెందులూరు, నారాయణపురం, కొవ్వలి, కైకలూరుతో పాటు కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. బాధితుల్లో కొందరు గర్భిణులు, ఆపరేషన్లు చేయించుకున్నవారు కూడా ఉన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్ల,పెద్ద…..యువకులే కాదు ముసలి వాళ్లు కూడా అంతా దీని బారిన పడుతున్నారు. ఉన్నట్లుండి స్పృహ కోల్పోతున్నారు. కొందరు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు.



నాలుగు రోజులుగా చికిత్స అందిస్తున్న ఏలూరు వైద్యులు… బాధితుల కళ్లల్లో నల్లగుడ్డు స్పందన క్షీణించిందని గుర్తించారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం అనుమానం వ్యక్తం చేసింది. ఇంతవరకు అందిన నివేదికల ప్రకారం తాగు నీరు కలుషితం కావడమే సమస్యకు ప్రధాన కారణం అన్న అనుమానం బలపడుతోందని వైద్యులు తెలిపారు. దీంతో అసలు ఏలూరుకు ఏమైందో తేల్చేందుకు ముగ్గురు సభ్యుల ఎయిమ్స్‌ బృందం రానుంది. పరిస్థితిని సమీక్షించి కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది.

ఇటు మంగళగిరి నుంచి వచ్చిన ఎయిమ్స్‌ బృందం ఏలూరులోనే ఉండి రోగులనుపరీక్షిస్తోంది. విజయవాడ నుంచి వచ్చిన ఆరు వైద్యబృందాలు ఏలూరులో సేవలు అందిస్తున్నాయి. అసలేం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం ఏలూరుకు చేరుకుంది. ఢిల్లీ ఎయిమ్స్ అధికారులతో కలిసి WHO బృందం అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో పర్యటించనుంది. బాధితులను అడిగి వివరాలు సేకరించనుంది. ఎయిమ్స్ వైద్యులు ఇవాళ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులంతా ఏలూరులోనే ఉన్నారు. డిప్యుటీ సీఎం ఆళ్లనాని, ఆరోగ్యశాఖ కమిషనర్‌, సెక్రటరీలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.