ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణం.. గర్భిణీ స్త్రీలపై ఎఫెక్ట్ : డా.రాకేష్ కక్కర్

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 03:43 PM IST
ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణం.. గర్భిణీ స్త్రీలపై ఎఫెక్ట్ : డా.రాకేష్ కక్కర్

Water pollution public illness eluru : ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్.. డాక్టర్ రాకేశ్ కక్కర్‌ అభిప్రాయపడ్డారు. నీరు, పాలు కలుషితం కావడంతోనే అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయన్నారు. పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలు, బ్యాటరీల వల్ల నీటి కాలుష్యం జరిగి ఉండొచ్చన్న ఆయన.. బాధితుల్లో ఎక్కువ మంది న్యూరోలాజికల్ సమస్యలకు గురయ్యారని చెప్పారు.



ఎక్కువ మందికి మూర్చ రావడం, స్పృహ కోల్పోవడం జరిగిందన్నారు. ఈ కాలుష్యం గర్భిణీ స్త్రీలపై తప్పకుండా ఎఫెక్ట్ చూపుతుందన్నారు. తాము బాధితులతో మాట్లాడినప్పు చాలా మంది నీళ్లు బ్లీచింగ్ వాసన, రుచి లేవని చెప్పారని, కొందరు మాత్రం నీటి రంగు మారినట్లు తెలిపారని అన్నారు. బ్లీచింగ్ వల్ల సమస్యలు వచ్చాయా లేదా అన్నది సెంట్రల్ టీమ్ పరిశోధనలో తెలుస్తుందని డాక్టర్ రాకేశ్‌ కక్కర్ అన్నారు.



పని చేస్తున్న వారు, గుడికి వెళ్లినవారు, ఇంట్లోవారితో మాట్లాడుతున్నవారు సడన్‌గా ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోతున్నారు. నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఇదే జరుగుతోంది. ప్రతీ ఒక్కరు చూస్తుండగానే కళ్లముందే ఫిట్స్ వచ్చినట్లు పడిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకు 502మంది ఆస్పత్రుల్లో చేరారు. గంటగంటకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో 332మందిని డిశ్చార్జ్‌ చేయగా…. 153మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటిదాకా ఏలూరును వణికించిన ఈ అంతుచిక్కని మహమ్మారి… చుట్టు పక్కల ప్రాంతాలకూ విస్తరిస్తోంది.



దెందులూరు, నారాయణపురం, కొవ్వాలి, కైకలూరుతో పాటు కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. బాధితుల్లో కొందరు గర్భిణులు, ఆపరేషన్లు చేయించుకున్నవారు కూడా ఉన్నారు. పిల్లలు లేదు-పెద్దలు లేదు…..యువకులే కాదు ముసలి వాళ్లు కూడా అంతా దీని బారిన పడుతున్నారు. ఉన్నట్లుండి స్పృహ తప్పుతున్నారు. కొందరు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు.



నాలుగు రోజులుగా చికిత్స అందిస్తున్న ఏలూరు వైద్యులు… బాధితుల కళ్లల్లో నల్లగుడ్డు స్పందన క్షీణించిందని గుర్తించారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం అనుమానం వ్యక్తం చేసింది. వైద్యులు, ఆయా నివేదిక ప్రకారం తాగు నీరు కలుషితం కావడమే సమస్యకు ప్రధాన కారణం అన్న అనుమానం బలపడుతోంది. దీంతో అసలు ఏలూరుకు ఏమైందో తేల్చేందుకు ముగ్గురు సభ్యుల ఎయిమ్స్‌ బృందం రానుంది. పరిస్థితిని సమీక్షించి కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. ఇటు మంగళగిరి నుంచి వచ్చిన ఎయిమ్స్‌ బృందం అక్కడే ఉంది. విజయవాడ నుంచి వచ్చిన ఆరు టీమ్‌లు ఏలూరులో సేవలు అందిస్తున్నాయి.



అసలేం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం ఏలూరుకు చేరుకుంది. ఢిల్లీ ఎయిమ్స్ అధికారులతో కలిసి WHO బృందం అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో పర్యటించనుంది. బాధితులను అడిగి వివరాలు సేకరించనుంది. ఎయిమ్స్ వైద్యులు ఇవాళ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులంతా ఏలూరులోనే ఉన్నారు. డిప్యుటీ సీఎం ఆళ్లనాని, ఆరోగ్యశాఖ కమిషనర్‌, సెక్రటరీలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.