వాతావరణం : రాగల 36 గంటల్లో వర్షాలు 

వాతావరణం : రాగల 36 గంటల్లో వర్షాలు 

కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈశాన్య మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిన తరువాతే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ  వివరించింది. మరోవైపు…ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

వీటి ప్రభావంతో బుధవారం ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రుద్రసముద్రంలో 90, దొనకొండలో 86, తెనాలి, కరకంబాడిలో 70, రేణిగుంట 68.5, కనిగిరి, ఆత్మకూరు, సత్తెనపల్లిల్లో 60, రాపూరు 55, చింతపల్లిలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కాగా….ఉత్తర భారతంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. రానున్న 36 గంటల్లో ఉత్తర భారతదేశంలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఐంఎండీ తెలిపింది.  ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడూ తెరిపి ఇస్తూ, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు, కచ్, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలు, చండీగఢ్, ఉత్తర పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్‌లోని అత్యధిక ప్రాంతాలు, ఉత్తరాఖండ్, జమ్మూ-కాశ్మీరు, లడఖ్, గిల్గిట్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లకు నైరుతి రుతు పవనాలు బుధవారం చేరుకున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

Read: రామ్మోహన్ నాయుడికి ప్రతిష్టాత్మక అవార్డు..