బంగాళాఖాతంలో శనివారం సాయంత్రానికి వాయుగుండం

  • Published By: murthy ,Published On : October 10, 2020 / 09:25 AM IST
బంగాళాఖాతంలో శనివారం సాయంత్రానికి వాయుగుండం

weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది.




దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపొస్పీయర్ స్థాయి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం, అక్టోబర్10వతేదీ సాయంత్రానికి అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్రలో ఈ నెల 12వతేదీ సోమవారం నాటికి తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తారంగానూ, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 3 రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.