దీదీ భారీ ర్యాలీ: చంద్రబాబు కీలక పాత్ర

  • Edited By: veegamteam , January 12, 2019 / 05:58 AM IST
దీదీ భారీ ర్యాలీ: చంద్రబాబు కీలక పాత్ర

పశ్చిమ బెంగాల్ : సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఓ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. జనవరి 19న కోల్‌కతాలో నిర్వహించే ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర వహించనున్నారు. 

కోల్‌కతా ర్యాలీ తర్వాత జాతీయ స్థాయిలో ‘మహాకూటమి’కి ఓ రూపు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ఈ నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ర్యాలీ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కాగా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, శరద్ పవార్, బాబూలాల్ మరాండీ తదితరులు తదితరులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. 

ర్యాలీకి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా మమతాబెనర్జీ ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ఈ ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు కూడా దీదీ ర్యాలీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ర్యాలీకి హాజరవుతారని సమాచారం.