చెల్లి పార్టీతో అన్న పార్టీలో కలవరం.. జగన్‌కు ఎదురుకానున్న సమస్యలేంటి? వైసీపీ నేతల భయాలేంటి?

చెల్లి పార్టీతో అన్న పార్టీలో కలవరం.. జగన్‌కు ఎదురుకానున్న సమస్యలేంటి? వైసీపీ నేతల భయాలేంటి?

problems for cm jagan with sharmila party: తెలంగాణలో చెల్లెలు స్విచ్చాన్ చేస్తే ఏపీలో అన్నకు షాక్ కొడుతోందా? అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న చెల్లెలు, ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్న అంశం వైసీపీ నేతలను కలవరపరుస్తోందా? పైకి టేక్ ఇట్ ఈజీగా ఉన్నట్టు కనిపిస్తున్నా..లోలోపల టెన్షన్ పడుతున్నారా? అసలు తమకు సంబంధం లేదు, తమపై ఎలాంటి ప్రభావం ఉండదు అంటున్నా.. వైసీపీ నేతలంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అన్న జగన్ వద్దన్నా చెల్లి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఏపీలోని వైసీపీకి ఎలాంటి సమస్యలు తలెత్తబోతున్నాయి? అసలు దీనంతటి వెనుకున్న మర్మం ఏంటి?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల, ఇందుకోసం కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. గడిచిన 4 నెలల నుంచి పొలిటికల్ స్టెప్ తీసుకోవాలని అనుకున్న ఆమె, తొలుత వైసీపీ తెలంగాణలో విస్తరించాలని భావించారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా వైఎస్ ఫ్యామిలీలో జరిగాయట. అయితే, తెలంగాణలో పార్టీ విస్తరణకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అంగీకరించలేదని చెబుతున్నారు. దీంతో సొంతంగా పార్టీ పెట్టాలనే నిర్ణయానికి షర్మిల వచ్చారని టాక్.

షర్మిల పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రభావం ఏపీలో ఉండదని వైసీపీ నేతలు బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం కలవరపడుతున్నారట. జగన్, షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్పినా.. అన్న మాట కాదని పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టడం అంటే, విబేధాలు లేకుండా జరగదనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నారు. కష్టాల్లో పార్టీకి అండగా ఉన్న షర్మిలను వదులుకోవడం మంచిది కాదనే అభిప్రాయం చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం భవిష్యత్తులో రెండు రాష్ట్రాల సమస్యల గురించి ఏపీ ప్రభుత్వంతో విబేధించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎలా డీల్ చేయాలనే చర్చ వైసీపీలో మొదలైందని అనుకుంటున్నార. భవిష్యత్తులో అన్న జగన్ పై చెల్లి షర్మిల కామెంట్స్ చేస్తే పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. షర్మిల పార్టీ ప్రభావం కచ్చితంగా ఏపీలోని వైసీపీపై పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తాజా పరిణామాలతో వైసీపీ వర్గాల్లో కొంత కలవరం, కొంత గుబులు మొదలైందని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో మేకపోతు గాంభీర్యం కనిపించిందనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. తొలిసారిగా షర్మిల పార్టీ పెడతారనే ప్రచారం మొదలైనప్పటి నుంచే వైసీపీలో గుబులు మొదలందట. అసలామె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుసుకునేందుకు ఆరా తియ్యడం మొదలుపెట్టారు. మరికొందరు రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొస్తున్నారు.

రాజకీయంగా ఎన్ని వ్యూహాలు ఉన్నా.. షర్మిల పార్టీతో వైఎస్ జగన్ వ్యక్తిగత ఇమేజ్ కు కొంత నష్టం కలుగుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ తన సొంత చెల్లెలికే న్యాయం చేయలేదన్న సంకేతాలు ప్రజల్లో బాగా వెళ్లాయని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. ఆస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రమంతా కలియతిరిగారు. తనను తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రతీ వేదికపైనా చాటిచెప్పారు.

పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు షర్మిల. 2019 ఎన్నికల్లోనూ కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత షర్మిల మళ్లీ ఎక్కడా కనిపించ లేదు. ఆమెకు జగన్ న్యాయం చెయ్యలేదని, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైసీపీ ముఖ్య నేతల్లో కొందరు అంటున్నారు. అందుకే షర్మిల తన సొంత అస్తిత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు.

గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్న అంశం గురించి ఇప్పటికీ రాజకీయ వర్గాలు మాట్లాడుతూనే ఉంటాయి. వైసీపీ నేతలు పదే పదే చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు షర్మిలకు అన్న జగన్ అన్యాయం చేశారంటూ విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం దొరికిందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటి విమర్శలు తీవ్రమైతే ఎలా ఎదుర్కోవాలి అనే కలవరం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

షర్మిల పార్టీ పెడుతున్నందుకు జగన్ బాధ పడుతున్నారు అంటూనే.. అన్నగా ఆమెకు ఆశీస్సులు ఉంటాయంటూ సజ్జల చెప్పడం మరింత చిత్రంగా ఉందని అంటున్నారు. తాజా పరిణామాలతో సొంత కుటుంబసభ్యులను జగన్ దూరం చేసుకున్నారన్న దుమారం పార్టీలో రేగుతోంది. షర్మిల నిర్ణయం మొత్తం మీద వైసీపీలో కలవరాన్ని రేపుతోందని అంటున్నారు.