ఏలూరు ఘటన ఏం చెబుతోంది ? : తింటున్న కూరగాయలు సేఫేనా ?

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 06:54 AM IST
ఏలూరు ఘటన ఏం చెబుతోంది ? : తింటున్న కూరగాయలు సేఫేనా ?

What does the Eluru incident say : ఏలూరు ఘటన ఏం చెబుతోంది..? పెస్టిసైడ్సే ముగ్గురి ప్రాణాలు తీశాయా..? పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..? మనం రోజూ తీసుకునే బియ్యం, కూరగాయల ద్వారా క్రిమిసంహారకాలు మన ఒంట్లో తిష్ట వేస్తున్నాయా..? మనం తింటున్న ఫుడ్‌ సేఫేనా..? ముందే మేల్కోనకపోతే.. రేపు ప్రతి ఊరు ఏలూరులా మారుతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలు కావడానికి అసలు కారణం కూరగాయలే అన్నది ప్రాథమికంగా తేలింది.

కూరగాయల సాగులో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం వల్లే ఈ వింతవ్యాధి వచ్చిందని తెలుస్తోంది. తాగునీటిలో వేలాది రెట్లు అధికంగా ఉన్న పురుగుమందుల అవశేషాలు కూడా పలుచోట్ల ఈ వింతవ్యాధికి కారణంగా చెబుతున్నారు. అయితే ఏలూరులో కృష్ణా, గోదావరి రెండు నదుల జలాలు తాగునీరుగా వాడుతున్న నేపథ్యంలో మొత్తం ఊరికి కాకుండా కొన్ని ప్రాంతాలకే ఈ వింతవ్యాధి పరిమితం కావడంతో ఇది కూరగాయల వల్లే వచ్చి ఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఏలూరులో వింతవ్యాధికి కూరగాయలపై చల్లిన పురుగుమందుల అవశేషాలే కీలకంగా మారాయి. దీంతో వైద్య సంస్థలు కూడా ఈ దిశగానే వింతవ్యాధిపై పరిశోధనలు చేస్తున్నాయి.

ఏలూరు వింత వ్యాధికి కారణంగా అధిక లెడ్‌, నికెల్‌ హెవీ మెటల్స్‌ అని రిపోర్టులు తేల్చాయి. మరోవైపు పురుగుమందుల అవశేషాలు కూడా బాధితుల శరీరాల్లో ఉన్నాయంటున్నాయి వైద్య సంస్థలు. మరి ఏలూరులో వందల మందిని వారు తీసుకున్న ఆహారమే ఆస్పత్రి పాలు చేసిందా..? అంటే.. బాధితుల రక్తంలో అధికంగా కనిపిస్తున్న లెడ్‌, నికెల్‌, పెస్టిసైడ్స్‌ అవశేషాలే దీనికి సమాధానంగా నిలుస్తున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లలో చేరుతున్న రసాయనాలు జనారోగ్యాన్ని కబలిస్తున్నాయి.
కూరగాయలు, బియ్యం ప్రతి ఇంట్లో నిత్యావసరాలు. మరి రేపు ప్రతి ఊరి ప్రతిస్థితి ఏలూరులా మారాల్సిందేనా..? మరి ఇలాంటి వింత వ్యాధులకు పరిష్కారమేంటి.? ముందే మేల్కొనకపోతే ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సి ఉంటుంది. భవిష్యత్‌ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.