ఆమంచి ఇలాఖాలో ఆ రాత్రి ఏం జరిగింది? నెత్తురు ఎందుకు చిందింది? ఇంత పెద్ద గొడవకి కారణమేంటి?

  • Published By: naveen ,Published On : November 2, 2020 / 03:57 PM IST
ఆమంచి ఇలాఖాలో ఆ రాత్రి ఏం జరిగింది? నెత్తురు ఎందుకు చిందింది? ఇంత పెద్ద గొడవకి కారణమేంటి?

amanchi krishna mohan: కరణం బలరాం.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే. ఆమంచి కృష్ణమోహన్.. ఇప్పుడు లోకల్ వైసీపీ స్ట్రాంగ్ లీడర్. ఇద్దరూ ఈక్వల్‌గానే ఉన్నారు. కరణం వైసీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచే.. చీరాలలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇన్నాళ్లూ అది సైలెంట్‌గానే ఉంది. బలరాం బర్త్ డే రోజే.. వాళ్ల మధ్య ఉన్న కోల్డ్ వార్ బద్దలైంది. 144 సెక్షన్ విధించేలా.. వందల్లో పోలీసులను దించేంత గొడవ జరిగింది. ఆమంచి సొంతూళ్లో.. కరణం పుట్టినరోజు వేడుకలే ఇందుకు కారణం. ఆ రాత్రి అక్కడేం జరిగింది? ఇంత పెద్ద గొడవ జరగటానికి కారణమేంటి?




గొడవకు బలరాం బర్త్ డేనే కారణం:
ఆమంచి ఇలాఖాలో.. కరణం బలరాం బర్త్ డే.. బలరాం బర్త్ డే రోజు బద్దలైన ఆధిపత్య పోరు.. రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ.. ఆమంచి సొంతూరు పందిళ్లపల్లిలో చిందిన నెత్తురు… చీరాల మాజీ ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరవరుల మధ్య గొడవకు.. బలరాం బర్త్ డేనే కారణమైంది. ఆమంచి సొంతూరు పందిళ్లపల్లిలో.. కరణం బలరాం పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతోనే పరిస్థితులు అదుపుతప్పాయ్. ఉద్రిక్తతలకు దారితీశాయ్.

ఆమంచి ఇంటి దగ్గర కరణం బలరాం జై అంటూ నినాదాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో.. ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించేందుకు.. తన కార్యకర్తలు, అనుచరగణంతో స్వగ్రామం పందిళ్లపల్లిలో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో.. వేటపాలెం, చీరాల నుంచి భారీ ఎత్తున ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులు బైక్ ర్యాలీగా వచ్చారు. ఆమంచి నివాసం దగ్గరకు చేరుకోగానే.. కరణం బలరాం జై అంటూ నినాదాలు చేశారు.
https://10tv.in/karanam-balaram-vs-amanchi-krishna-mohan-group-clashes-in-chirala/
పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత:
కరణం అనుచరులు చేసిన హంగామా చూసి.. అక్కడే ఉన్న ఆమంచి వర్గీయులు.. జై ఆమంచి అంటూ నినాదాలు చేశారు. అంతే.. ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయ్. రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. రెండు వర్గాల పరస్పర దాడులతో.. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి చెదరగొట్టడంతో.. కరణం అనుచరులు పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రాంతానికి వెళ్లిపోయారు.

రెచ్చగొట్టేందుకే ఆమంచి ఇంటికి సమీపంలో బలరాం బర్త్ డే వేడుకలు:
ఆమంచి నివాసానికి.. కరణం పుట్టినరోజు వేడుకలు జరిగే ప్రదేశానికి కేవలం వంద మీటర్ల దూరం మాత్రమే ఉంది. తమను రెచ్చగొట్టేందుకే.. కరణం అనుచరులు పందిళ్లపల్లిలో ఆయన బర్త్ డే జరిపారని.. ఆమంచి వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. మాటలతో రెచ్చగొడుతున్న కరణం బలరాం వర్గీయులవైపు మళ్లీ కొందరు దూసుకెళ్లడంతో.. మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ భీకర పోరులో.. ఆమంచి వర్గానికి చెందిన ఏసుబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు:
రెండోసారి గొడవ చెలరేగినప్పుడు.. పోలీసులు అక్కడే ఉన్నారు. కానీ.. పరిస్థితిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఒంగోలు ఏఎస్పీ రవిచంద్రతో పాటు ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, పది మంది ఏఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లు ఉండి కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారంటున్నారు. ఆమంచి వర్గానికే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఘర్షణ తర్వాత కరణం బలరాంపై కృష్ణమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావాలనే.. కరణం బలరాం ఆయన పుట్టినరోజు వేడుకలను.. తన సొంతూరు పందిళ్లపల్లిలో నిర్వహించాడని చెప్పారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే.. భయపడేది లేదంటూ కరణం బలరాం వర్గాన్ని హెచ్చరించారు.




పందిళ్లపల్లిలో 144 సెక్షన్:
కరణం బలరాం, ఆమంచి వర్గాల మధ్య భీకర ఘర్షణ జరగడంతో.. కృష్ణమోహన్ సొంతూరు పందిళ్లపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో.. మరోసారి రెండు గ్రూపులు గొడవపడే అవకాశం ఉందని తెలిసి.. పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో.. పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ప్రతి వీధిలో సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాలు కాపలా కాశాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా.. పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు ర్యాలీ నిర్వహించాలనుకున్న ఆమంచి కృష్ణమోహన్‌కు పోలీసులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు.

గొడవకు సంబంధించి.. ఆమంచి, కరణం వర్గాల్లోని కొందరిని పోలీసులు గుర్తించారు. కొంతమందిపై ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినట్లు సమాచారం. పూర్తిస్థాయి విచారణ జరిపాక.. పరిస్థితి ఎలా అదుపు తప్పింది? ఘర్షణతో ఎవరెవరికి సంబంధం ఉంది? ముందు ఎవరు దాడి చేశారు? గొడవకు బాధ్యులెవరన్నది త్వరలోనే తేలుస్తామన్నారు ఏఎస్పీ రవిచంద్ర.

పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఆమంచి:
తన స్వగ్రామం పందిళ్లపల్లిలో చోటు చేసుకున్న ఈ గొడవను.. ఆమంచి కృష్ణమోహన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే.. ఈ విషయాన్ని వైసీపీలోని కీలక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు ఆమంచి కృష్ణమోహన్. తనను రెచ్చగొట్టేందుకే.. తన సొంతూరులో కరణం బలరాం బర్త్ డే వేడుకలు నిర్వహించారని చెప్పారు. సీఎం పీఎస్, ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి వేమా ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేనికి విషయం మొత్తం వివరించారు.

ఒకే పార్టీలో ఉంటూ.. ఒకే జెండా కింద పనిచేస్తున్న.. ఇద్దరు బలమైన నాయకుల మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరు.. స్థానికంగా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. వైసీపీ అధిష్టానం.. ఈ విషయంలో జోక్యం చేసుకొని.. ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.




రక్తచరిత్ర కరణంకు అలవాటు.. దాడులు, బెదిరింపులు ఆమంచి నైజం:
తనను రెచ్చగొట్టేందుకే.. కరణం బలరాం తన సొంతూరులో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపిస్తున్నారు. రక్తచరిత్ర కరణంకు అలవాటని చెబుతున్నారు. అలాంటి చరిత్రకు.. చీరాలలో చోటు లేదన్నారు. జగన్ కాళ్లు పట్టుకొని.. కరణం బలరాం వైసీపీలోకి వచ్చారని విమర్శించారు. చీరాలలో.. కరణం బలరాం చేస్తున్నవి పులిహోర గొడవలని ఎద్దేవా చేశారు. ఆమంచి వర్గీయులే.. ప్లాన్ ప్రకారం తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని కరణం బలరాం వర్గానికి చెందిన.. వైసీపీ నేత అమృతపాణి చెబుతున్నారు. దాడులు చేయించడం, బెదిరించడం, ఇతరులను లొంగదీసుకోవడం ఆమంచి నైజమన్నారు. పందిళ్లపల్లిలో జరిగిన గొడవకు సంబంధించి.. వైసీపీ అధిష్టానానికి అన్ని వివరాలు చెప్పామన్నారు అమృతపాణి.

పందిళ్లపల్లిలో.. ఆమంచి, కరణం బలరాం వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై పోలీసులు చర్యలు చేపట్టారు. 2 వర్గాలకు చెందిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. విచారణ జరపుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌.