ఏకగ్రీవానికి సహకరిస్తారా? పోటీకి సిద్ధమవుతారా? బీజేపీకి మద్దతిస్తారా? తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబు వైఖరేంటి?

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 03:56 PM IST
ఏకగ్రీవానికి సహకరిస్తారా? పోటీకి సిద్ధమవుతారా? బీజేపీకి మద్దతిస్తారా? తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబు వైఖరేంటి?

tirupati bypolls: తిరుపతి సిటింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఒకవేళ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అధికార పార్టీ టిక్కెట్ ఇచ్చినట్లయితే ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడానికి సహకరిస్తాయా? లేదా? అనేది అనుమానమే. ఇప్పటికే బీజేపీ, జనసేన కూటమి పోటీ చేస్తామని ప్రకటించాయి. దీంతో పోటీ అనివార్యమైతే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది.

బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు?
బల్లి దుర్గాప్రసాద్‌కి, వైసీపీ అధిష్టానానికి సరైన సంబంధాలు లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం అనుమానమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేసే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తిరుపతిలో కూడా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఒకవేళ అధికార పార్టీ టికెట్‌ ఇచ్చినట్లయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందా? పోటీకి సిద్ధమవుతుందా? అన్నది చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ నేరుగా పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీనిని టీడీపీ అధిష్టానం ఖండిస్తోంది.

పోటీ చేయాల్సిందే అంటున్న తమ్ముళ్లు:
సార్వత్రిక ఎన్నికలు ముగిసి 15 నెలలు అయింది. ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అనేక సమస్యలపై పోరాటం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజల్లో కూడా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నిక జరిగితే ప్రజలనాడిని కూడా తెలుసుకుని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో టీడీపీలో కొందరు నేతలు పోటీకి మొగ్గు చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా మనం పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు దగ్గర కుండబద్దలు కొట్టినట్టు చెపుతున్నారు.

నంద్యాలో ఉపఎన్నికను గుర్తు చేస్తున్న తమ్ముళ్లు:
ఇటీవల తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు చంద్రబాబు. తెలుగు తమ్ముళ్లు గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ పోటీ పెట్టిందని, అందువల్ల ఇప్పుడు మనం గత సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో చెప్పారు. దీంతో తిరుపతి పార్లమెంట్‌కు పోటీ పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

రేసులో పరసా రత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్ కుమార్, తలారి ఆదిత్య:
పోటీకి సిద్ధమని చెబుతున్నప్పటికీ ఎవరు పోటీ చేయాలనే అంశంపై టీడీపీలో ఒక క్లారిటీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009లో పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిన వర్ల రామయ్య అయితే కరెక్ట్ అని అక్కడ స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారని టాక్‌. అదే విధంగా మాజీ మంత్రి పరసా రత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్ కుమార్, తలారి ఆదిత్య తదితరులు కూడా రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

పోటీ చేయొద్దంటున్న కొందరు టీడీపీ నేతలు:
మొన్నటి ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్‌కి లక్షా 39 వేల మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ మెజారిటీతో పోలిస్తే పార్లమెంట్‌కి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒక్క తిరుపతి సెగ్మెంట్‌లోనే వందల ఓట్ల తేడాతో టీడీపీ ఓడింది. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చాయి. బల్లి దుర్గాప్రసాద్ సుదీర్ఘకాలం టిడిపిలో కొనసాగారు కాబట్టి వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టిక్కెట్ ఇస్తే పోటీ పెట్టకూడదని కొందరు నేతలు ప్రతిపాదించారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వదిలేసినా బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఎలా వదిలేస్తామనే వాదనను కొంతమంది తీసుకువస్తున్నారు.

బీజేపీలోకి పనబాక?
అధినేత మాత్రం 2019లో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కాకపోతే ఆమె పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో మంత్రిగా పని చేసిన సందర్భంలో అక్కడి బీజేపీ నేతలతో ఆమెకు పరిచయాలున్నాయి. వాటి ద్వారా పనబాక బీజేపీలోకి వెళ్లి.. ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాల మీద క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.