చావడానికి భయపడరు, చంపడానికీ వెనుకాడరు.. ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్..? స్పెషాలిటీ ఏంటి..?

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 03:46 PM IST
చావడానికి భయపడరు, చంపడానికీ వెనుకాడరు.. ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్..? స్పెషాలిటీ ఏంటి..?

full demand for red sandalwood: ఎంతో విలువుంటేనే ఏదైనా వస్తువు కోసం ప్రాణాలర్పిస్తాం. రెడ్‌ శాండల్‌ కూడా అలాంటిదే. దానికంత వ్యాల్యూ ఉంది కాబట్టే కొంతమంది డేర్ చేస్తున్నారు. ఇంతకూ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్..? దీని స్పెషాలిటీ ఏంటి..? ప్రాణాలు పోతాయని తెలిసినా ఎందుకు కొంతమంది సాహసం చేస్తున్నారు..?

ప్రపంచంలో అరుదైన వృక్షంగా గుర్తింపు:
ఎర్రచందనం శేషాచలం కొండల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని సుమారు 5వేల 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఒక్కో చెట్టూ సుమారు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. అయితే దీని పెరుగుదల చాలా నెమ్మదిగా సాగుతుంది. చెట్టు మొదలు భాగం 28 అంగుళాలు రావడానికి 50ఏళ్లకు పైగా సమయం పడుతుందంటే ఇది ఎంత నెమ్మదిగా పెరుగుతుందో తెలుస్తుంది.



2000లో అంతరించిపోతున్న వృక్షజాతిగా గుర్తింపు..నరకడం, అమ్మడం, కొనడంపై నిషేధం:
2000 సంవత్సరంలో ఎర్రచందనాన్ని అంతరించిపోతున్న వృక్షాల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాక.. ఇప్పుడున్న వృక్షాలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని నరకడం కానీ, తరలించడం కానీ, అమ్మడం కానీ, ఎగుమతి చేయడం కానీ చేయకూడదు. అప్పటి నుంచి దీని విలువేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
https://10tv.in/cine-stars-political-leaders-behind-red-sandalwood-smuggling/
విదేశాల్లో రెడ్‌ శాండల్‌కు ఫుల్ గిరాకీ:
భారత్‌లో రెడ్‌శాండల్‌ అమ్మకాలపై నిషేధం ఉంది. కానీ విదేశాల్లో దీనికి మంచి బిజినెస్‌ నడుస్తోంది. అందుకే దీన్ని ఎగుమతి చేసేందుకు స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్‌లో రెడ్‌ శాండల్‌కు ఫుల్ గిరాకీ. చైనాకు చెందిన ఆలీబాబా ఈ కామర్స్‌ సంస్థ రెడ్‌ శాండల్‌ను ఆన్‌లైన్‌లో కూడా అమ్ముతోంది. కిలో రెడ్ శాండల్ పౌడర్‌ క్వాలిటీని బట్టి 1300 నుంచి 5వేల రూపాయల ధర పలుకుతోంది. నాణ్యమైన రెడ్‌ శాండల్‌ పౌడరే టన్ను 50 లక్షలు ధర పలుకుతోందంటే ఇది ఎంత విలువైన వస్తువో అర్థం చేసుకోవచ్చు.

గోడౌన్లలో మగ్గుతున్న రూ.10వేల కోట్ల విలువైన ఎర్రచందనం:
విదేశాలకు ఎగుమతి చేస్తూ పట్టుబడ్డ ఎర్రచందనం మన దేశంలో కూడా బాగానే పేరుకుపోయింది. 2014 డిసెంబర్ నాటికి ఇలా స్మగ్లర్ల నుంచి పట్టుబడి గోడౌన్లలో మగ్గుతున్న ఎర్రచందనం విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇప్పడు దాని విలువ అంతకు నాలుగింతలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశంలో పలు రాష్ట్రాల్లో పట్టుబడి గోడౌన్లలో మగ్గుతున్న రెడ్‌ శాండల్ విలువ ఇప్పుడు 10వేల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. వాస్తవానికి అత్యంత నాణ్యమైన ఎర్రచందనం విలువ టన్నుకు కోటి రూపాయల వరకూ పలుకుతుందని అంచనా. 2014లో దీని విలువ టన్నుకు 70 లక్షల వరకూ పలికేదని ఓ ట్రేడర్ వివరణ. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తమిళనాడులో కూడా భారీగా ఎర్రచందనం విలువలున్నాయి. సుమారు 900 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం తమిళనాడులో ఉంటుందని ఓ అంచనా.

10 సార్లలో పట్టుబడుతున్నది ఒక్కసారే!
స్మగ్లర్లు తరలిస్తున్న ఎర్రచందనంలో పోలీసులు లేదా అటవీశాఖాధికారులకు చిక్కుతున్నది చాలా తక్కువ. ప్రతి 10 తరలింపుల్లో ఒక్కసారి మాత్రమే పట్టుబడుతోందని ఓ అంచనా. ఉదాహరణకు ఒకసారి ఓ టన్ను రెడ్ శాండల్‌ దొరికిందంటే.. 9 టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోతున్నట్టు లెక్క.



రెడ్‌ శాండల్‌ను లీగల్‌గా అమ్ముకునే అవకాశం:
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రెడ్‌ శాండల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం దీన్ని వేలం వేసింది. ఎర్రచందనాన్ని లీగల్‌గా కూడా అమ్ముకోవచ్చు. కొంతమంది రైతులు తమ పొలాల్లో ఉన్న ఎర్రచందనం చెట్లను నరికి అమ్మేందుకు అటవీశాఖాధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్‌ తీసుకున్న తర్వాత వాటిని కొనేందుకు వ్యాపారులు కొని అమ్మేవారు. అయితే లీగల్‌గా అమ్మే ఎర్రచందనం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. పైగా పర్మిషన్ల కోసం నానా తిప్పలూ పడాల్సి ఉంటుంది. అందుకే క్రమంగా లీగల్‌గా అమ్మేవాళ్లు తగ్గిపోయారు. కొనేవాళ్లు కూడా లేరు. దీంతో ఎర్రచందనం గిరాకీ తెలిసిన బడా వ్యాపారులు స్మగ్లర్ల అవతారమెత్తారు. తమ దారికి అడ్డొచ్చే ఎవరినైనా హతమార్చేందుకు వీళ్లు ఏమాత్రం వెనుకాడరు.