సెలక్ట్ కమిటీ అంటే ఏమిటి? విధులు ఏంటి? : జగన్ కు లాభమా? నష్టమా?

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 02:57 AM IST
సెలక్ట్ కమిటీ అంటే ఏమిటి? విధులు ఏంటి? : జగన్ కు లాభమా? నష్టమా?

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. ఐతే.. ఇప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అసలు సెలక్ట్ కమిటీ అంటే ఏంటి? దాన్ని విధులు ఏంటి? సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా? టీడీపీకి లాభం జరుగుతుందా? 

మండలిలో ప్రతిపక్షం పట్టుదల కారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులు సెలక్ట్‌ కమిటీకి పంపిచారు చైర్మన్‌ షరీఫ్‌. తన విచక్షణాధికారంతో చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. ఓ బిల్లు వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తేనే సభ్యులు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరతారు. మరోవైపు శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపాదించింది కాబట్టి.. మండలి నుంచే సదరు కమిటీని కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

శాసనసభలో స్పీకర్ కమిటీలను నియమిస్తారు. శాసనమండలిలో చైర్మన్ కమిటీ సభ్యలను ఎంపిక చేస్తారు. ఐతే.. శాసనమండలిలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలుసుకుని.. వారి పర్సంటేజీ ప్రకారం ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీ సభ్యులను నియమిస్తారు. అంటే ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది సెలక్ట్ కమిటీలో ఉంటారు.

ఇక సెలక్ట్‌ కమిటీ గరిష్టంగా 3 నెలల్లో తమ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపిచడం వెనక అమరావతి ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ అనుసరించిన వ్యూహమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ బిల్లులు ఆమోదం పొందితే.. అమరావతి ఉద్యమం నీరుగారిపోతుందనే టీడీపీ ఈ అస్త్రం ప్రయోగించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత.. ఆ కమిటీ సభ్యులు బిల్లు వల్ల ప్రభావితం అయ్యే వారి వాదనలను వింటారు. అంటే అమరావతి రైతులతో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాల వారి వాదనలను కూడా వినాలి. మొత్తం 13 జిల్లాల్లోని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు, వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అనంతరం ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని ప్రతిపాదిస్తుంది. అనంతరం ఆ బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపుతుంది.

సెలక్ట్ కమిటీ పరిశీలించి రూపొందించిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తారు. అక్కడ చర్చించి ఆమోదించిన తర్వాత మరోసారి శాసనమండలికి వస్తుంది. ఐతే.. సెలక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాలకు మళ్లీ శాసనసభలో సవరణలు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓ రకంగా సెలక్ట్ కమిటీ ప్రతిపాదించే సూచనలకు శాసనసభలో మళ్లీ మార్పులు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్లీ మండలికి వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే ఓకే. ఒకవేళ బిల్లు ఆమోదం పొందక పోతే రెండోసారి శాసనసభలో అదే బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినట్టుగా తేల్చుతారు.

* సెలక్ట్‌ కమిటీకి 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు
* మండలి నుంచే సెలక్ట్‌ కమిటీ సభ్యుల ఎంపిక
* ఎమ్మెల్సీల సంఖ్య ప్రకారం కమిటీలో ప్రాతినిధ్యం 
* మండలిలో బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం

* కమిటీలో టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండే అవకాశం
* గరిష్టంగా 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్న సెలక్ట్‌ కమిటీ
* బిల్లులో మార్పులు చేర్పులపై కమిటీ ప్రతిపాదనలు

సెలక్ట్ కమిటీ విధులు:
* సెలక్ట్ కమిటీకి కాలపరిమితిని మండలి చైర్మన్ నిర్ధేశించవచ్చు.
* బిల్లు ప్రవేశపెట్టిన మంత్రే సెలెక్ట్ కమిటీకి చైర్మన్ గా ఉంటారు.
* సభలో బలాబలాల ప్రకారమే సెలెక్ట్ కమిటీని నియమిస్తారు.
* బిల్లుపై సెలక్ట్ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించి సవరణలు సూచించవచ్చు.
* సెలక్ట్ కమిటీ నివేదికను మండలికే సమర్పించాల్సి ఉంటుంది

* సెలక్ట్ కమిటీ నివేదికపై మండలిలో చర్చిస్తారు.
* మండలిలో చర్చ తర్వాత అవసరమైన మేరకు సవరణలు చేయవచ్చు.
* సవరణలతో కూడిన బిల్లును తిరిగి శాసనసభకు పంపిస్తారు.
* మండలి నుంచి తిరిగి వచ్చిన బిల్లులోని సవరణలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోపోవచ్చు.
* ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా బిల్లును తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
* అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మళ్లీ మండలికి పంపుతారు
* మండలి ఆమోదించినా… ఆమోదించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా ఆమోదం కోసం గవర్నర్ కోసం పంపొచ్చు

Also Read : Google Payకు పోటీగా: Jioలోనూ UPI పేమెంట్ వచ్చేసింది