వలస కార్మికులు ఏపీలోకి రాగానే క్వారంటైన్ సెంటర్లకు పంపుతాం : మంత్రి ఆళ్లనాని

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 03:59 PM IST
వలస కార్మికులు ఏపీలోకి రాగానే క్వారంటైన్ సెంటర్లకు పంపుతాం : మంత్రి ఆళ్లనాని

ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చే వలస కార్మికులు ఏపీలోకి రాగానే క్వారంటైన్ కు పంపుతామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో పది బెడ్లకు తగ్గకుండా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బెడ్లను సిద్ధం చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాబోయే వలస కార్మికులు ఏపీలోకి వచ్చే లోపు ఈ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. క్వారంటైన్లలో టాయిలెట్స్, బెడ్ షీట్లు, ఆరోగ్య కరమైన పరిస్థితులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూలీలకు నాణ్యమైన భోజనం పెడతామని తెలిపారు. ప్రత్యేకించి పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొన్ని రెడ్ జోన్ ఏరియాల్లో  అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. 

మొబైల్ మార్కెట్లను ఏర్పాటు చేసి 500 ఆర్టీసీ బస్సులను కేటాయించామని తెలిపారు. ఎక్కడైతే కేసులు పెరిగే అవకాశం ఉందో అక్కడ ప్రతి ప్రాంతానికి సంబంధించి 500 ఆర్టీసీ బస్సుల్లో కూరగాయలు, పాలు, నిత్యవసరాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సమీక్షలో ఆదేశించారు. 

నిత్యవసరాలతోపాటు ఒక డాక్టర్, ఒక ఏఎన్ ఎమ్, ఒక ఆశా వర్కర్ ను అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిత్యవసరాలు తీసుకోవడానికి ఇంటికి ఒకరి మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా ఆదేశించారు. వీటితోపాటు అత్యంత ప్రధానంగా టెలీ మెడిసిన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 

దేశంలో పది లక్షల వరకు కరోనా టెస్టులు జరిగితే వీటిలో ఇప్పటివరకు 1లక్షా 14 వేల 937 టెస్టులు ఒక్క ఏపీలోనే చేసినట్లు తెలిపారు. 1583 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కోలుకుని 488 మందిని డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసున్నట్లు తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.