విశాఖలో విషవాయువు.. స్టైరిన్ గ్యాస్ దేనికి వాడతారు, ప్రమాదం ఎలా జరిగింది

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 07:36 AM IST
విశాఖలో విషవాయువు.. స్టైరిన్ గ్యాస్ దేనికి వాడతారు, ప్రమాదం ఎలా జరిగింది

కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వేళ విశాఖలో మరో ఉపద్రవం ఊడి పడింది. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోయాయి. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస అందక సతమతం అవుతున్నారు. కళ్లు కనిపించడం లేదు, చర్మం మండిపోతోంది, కడుపులో వికారం. చూస్తుండగానే స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ లో జరిగిన భారీ ప్రమాదంలో విషవాయువు స్టైరిన్(styrene)లీక్ అయ్యింది. 

స్టైరిన్ గ్యాస్ దేనికి వాడతారు? మనిషిపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది?
స్టైరిన్ గ్యాస్. ఇప్పుడీ కెమికల్ గ్యాస్ హాట్ టాపిక్ గా మారింది. గోపాలపట్నంలో ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్న ఈ విషవాయువు గురించి అంతా చర్చించుకుంటున్నారు. అసలు స్టైరిన్ గ్యాస్ దేనికి వాడతారు? దాని వల్ల కలిగే అనర్థాలు ఏంటి? మనిషిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ప్రమాదం ఎలా జరిగింది?

గురువారం తెల్లవారుజామున ఎల్ జీ పాలిమర్స్ లో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్టైరిన్ అనే కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఆ గాలిని పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందగా, దాదాపు 2వేల మంది అస్వస్థతకు గురయ్యారు. లోనయ్యారు. 

పాలిస్టిరిన్ తయారీకి స్టైరిన్ గ్యాస్ వాడకం:
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ ఆర్ వెంకటాపురంలో 1997లో ఎల్ జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీని నెలకొల్పారు. దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీలో రోజూ 417 టన్నుల పాలిస్టిరిన్(polystyrene) ఉత్పత్తి జరుగుతుంది. అయితే స్టైరిన్ అనే గ్యాస్ ను ముడిసరకుగా పాలిస్టిరిన్ ను తయారు చేస్తారు. తాజాగా పాలిమర్స్ లో చోటుచేసుకున్న ప్రమాదంలో స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ గ్యాస్ ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి. గతంలో కూడా ఎల్ జి పాలిమర్స్ లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టింది.

ప్రమాదానికి కారణం ఇదే:
లాక్ డౌన్ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులు జరగకపోవడంతో స్టైరిన్ ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* మిగిలిన గ్యాస్ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు. 
* ఈ ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. 
* అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొంతవరకూ అస్వస్థతకు గురి అవుతారు. 
* ఈ గ్యాస్ ప్రభావం ఒకటి, రెండు రోజుల వరకూ ఉంటుంది. 
* స్టైరిన్ గ్యాస్ ను పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది.
* అలాగే జీర్ణాశయంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. 
* ఒకవేళ గ్యాస్ ను కనుక అధిక మోతాదులో పీలిస్తే ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది.
* గ్యాస్ కలిసిన గాలిని అరగంట పీల్చితే మరణం
* గ్యాస్ కలిసిన గాలిని పీలిస్తే 10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి
* లాంగ్ టర్మ్ లో కేన్సర్ వచ్చే అవకాశం

Also Read | విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోడీ