మోక్షజ్ఞను నీళ్లలో తోసేశాడా? చంపి పూడ్చిపెట్టాడా? బాబాయి ఆస్తి కోసం కిరాతకం.. ఇంకా దొరకని చిన్నారి ఆచూకీ

  • Published By: naveen ,Published On : October 9, 2020 / 03:19 PM IST
మోక్షజ్ఞను నీళ్లలో తోసేశాడా? చంపి పూడ్చిపెట్టాడా? బాబాయి ఆస్తి కోసం కిరాతకం.. ఇంకా దొరకని చిన్నారి ఆచూకీ

where is mokshagna : అనంతపురంలో చిన్నారి మోక్షజ్ఞ ఆచూకీ ఇంకా దొరకలేదు. హంద్రీనీవా కాలువలో పోలీసులు రెండు రోజులుగా గాలిస్తున్నారు. గార్లదిన్నె మండలం మార్తాడులో చిన్నారులు శశిధర్(6), మోక్షజ్ఞ(3)ను పెద్దనాన్న కొడుకు రాము కిడ్నాప్‌ చేశాడు. శశిధర్‌ హంద్రీనీవా కాలువలో కొట్టుకు రాగా.. స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. మరో చిన్నారి మోక్షజ్ఞ ఆచూకీ తెలియడం లేదు. బాబాయి ఆస్తి కోసం ఇద్దరు తమ్ముళ్లను రాము కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

రిజర్వాయర్‌లో పడేయలేదా…? చంపేసి పూడ్చి పెట్టాడా…?
చిన్నాన్న బిడ్డలను సొంత తమ్ముళ్లలా చూసుకోవాల్సిన వాడు దారుణానికి ఒడిగట్టాడు. వయస్సులో చిన్నవాడైనా చాలా కఠినంగా మారి క్రూరంగా ప్రవర్తించాడు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా కర్కశంగా ఇద్దరిని రిజర్వాయర్‌లో తోసేశాడు. చిన్నారి శశిధర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరి మోక్షజ్ఞ ఎక్కడున్నాడు…? శశిధర్‌తో పాటు మోక్షజ్ఞను రాము రిజర్వాయర్‌లో పడేయలేదా…? చంపేసి పూడ్చి పెట్టాడా…? లేక మోక్షజ్ఞను దాచి పెట్టి రాము నాటకాలు ఆడుతున్నాడా…? రెండు రోజులు దాటినా మోక్షజ్ఞ దొరక్కపోవడానికి కారణాలేంటి…? రాము ఆస్తి కోసమే ఇదంతా చేశాడా…? ఇవే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. పోలీసులు సైతం ఇదే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశాడు.

చాక్లెట్లు కొనిస్తానని ఆశ పెట్టి:
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో కిడ్నాప్ కలకం రేగింది. చిన్నాన్న కొడుకులైన శశిధర్, మోక్షజ్ఞలు ఇంటిముందు ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి నమ్మబలికిన రాము వారిని బయటకు తీసుకువెళ్ళాడు. ఆపై వారిని దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. దగ్గర్లో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌లో తోసేశాడు.

ఘాతుకాన్ని ఒప్పుకున్న రాము:
ఆడుకోడానికి వెళ్లిన పిల్లలు ఇంటికి ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాముపై అనుమానంతో ప్రశ్నించగా బాబాయ్ కొడుకులను తానే తీసుకెళ్లినట్లు ఒప్పుకున్న రాము అతను చేసిన ఘాతుకాన్ని పోలీసుల ముందు చెప్పాడు.

హంద్రీనీవా కాలువలో కనిపించిన శశిధర్:
ఇక కూడేరు సమీపంలోని హంద్రీనీవా కాలువలో శశిధర్ ప్రాణాపాయ స్థితిలో కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు… తీవ్రగాయాలతో పడి ఉన్న శశిధర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకో చిన్నారి మోక్షజ్ఞ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాడు.

10 ఎకరాల పొలం కోసం దారుణం:
ఆస్తి కోసం అన్న కొడుకు చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చిన్నాన్న ఇద్దరు కొడుకులు చనిపోతే, చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం కూడా తనకే వస్తుందని ఆశతో రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు రాముని అదుపులోకి తీసుకొని ఈ కేసును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కేవలం ఆస్తి కోసమే రాము ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా…? లేక మరేదైనా కారణం ఉందా…? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బుధవారం(అక్టోబర్ 7,2020) ఆరు గంటలకు రాము ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. అంటే పిల్లలు కిడ్నాపై రెండు రోజులైపోయింది. పోలీసులు గాలింపు మొదలు పెట్టిన 32 గంటలు దాటింది. అయినప్పటికీ మోక్షజ్ఞ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు తెప్పలతో జీడిపల్లి రిజర్వాయర్‌ చుట్టూ ఉన్న కాల్వలను జల్లెడ పడుతున్నారు.