Prakasam : జిల్లాలో వైట్ కాలర్ నేరాలు.. కేటుగాళ్లకు కోట్లు సమర్పించుకుంటున్న అమాయకులు

ప్రకాశం జిల్లాలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధికవడ్డీ ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. కొద్దీ కాలానికే బోర్టు తిప్పేస్తున్నారు. రెండేళ్లలో దాదాపు రూ.200 కోట్ల మోసాలు జరిగినట్లుగా తెలుస్తుంది.

10TV Telugu News

Prakasam : మోసపోయే వారు ఉంటే మోసం చేసేవారికి కొదవేముంది. ఈ మోసపోయే వారిని ఆసరాగా చేసుకొనే అనేక ఫేక్ కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి.. ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ కంపెనీల వలలో పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. ప్రజల వద్ద నుంచి డబ్బు తీసుకున్న కంపెనీలు, రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన వ్యాపారులు డబ్బు ఎగ్గొట్టి పారిపోతున్నారు. ఇటువంటి మోసాలు ప్రకాశం జిల్లాలో పరిపాటిగా మారిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. గడిచిన రెండేళ్లలో రూ.200 కోట్ల మేర మోసాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు.

అధికవడ్డీ ఇస్తామని కొందరు ఆశచూపి ప్రజలను మోసం చేస్తుంటే మరికొందరు ఇప్పుడు డబ్బు ఇస్తే మూడు నెలల్లో దానికి డబుల్ ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ఇటువంటి మోసాలు లెక్కలేనన్ని వెలుగులోకి వచ్చాయి. వ్యాపారం, ఫైనాన్స్ కంపెనీల పేరుతో కార్యాలయాలు ప్రారంభించి అమాయకుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం చీరాల పొలిమేర రోడ్డులో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ లిమిటెడ్‌ కంపెనీ నుంచి.. నేటి వేటపాలెం కో-ఆపరేటివ్‌ సొసైటీ వ్యవహారం వరకూ ఇదే పరిస్థితి.. ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో ఇటీవల ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 100 కోట్లకు పైగా జనానికి చెల్లించకుండా దుకాణం సర్దేశాడు. కారంచేడులో మరో ఫైనాన్స్‌ వ్యాపారి ఇదే తరహాలో చీట్ంగ్ చేసి, ఐపీ పెట్టాడు.

మోసం స్థాయి కోట్లల్లో ఉంటుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. బయటకు చెప్పుకుంటే తమ పరువు పోతుందని గుట్టుగా ఉంటున్నారు మరికొందరు బాధితులు. గతంలో చీరాలలో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ నుంచి మొదలు ఇటీవలి వేటపాలెం సొసైటీ వరకు అంతా నమ్మకంగా ముంచేస్తున్నారు. కారంచేడులో ఐపీ పెట్టిన మద్యం వ్యాపారి, పర్చూరు, యద్దనపూడి మండలాల్లో మిర్చి రైతులను మోసం చేసిన కొనుగోలుదారులు, కొత్తపేటలో శ్రీవారి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి రాత్రికి రాత్రి దుకాణం సర్దుకుని చెక్కేసిన ఘరానా పెద్ధమనుషుల వరకు చీట్ ఫండ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి.

అత్యాశకు పోయి కొందరు, నమ్మకంతో మరికొందరు డబ్బు ఇచ్చి దారుణంగా మోసపోయారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని భారీమొత్తంలో వసూలు చేసి రాత్రికి రాత్రే చెక్కేశారు కేటుగాళ్లు. ప్రజలు కూడా ఈ కేటుగాళ్లు విషయంలో అప్రమత్తంగా ఉండటం లేదు. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపడంతో అప్పుతెచ్చి మరి డబ్బు చెల్లిస్తున్నారు. డబ్బులు తీసుకోని ఫ్లేటు పిరాయించడంతో ఈ పరిస్థితుల్లో ఏమీచేయాలో తెలియక డిపాజిట్ దారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

10TV Telugu News