కోడెల ఫ్యామిలీని టీడీపీ ఎందుకు దూరం పెట్టిందంటే?

కోడెల ఫ్యామిలీని టీడీపీ ఎందుకు దూరం పెట్టిందంటే?

సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిని ఇప్పటి వరకూ నియమించలేదు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ మొదటిసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కోడెల ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పటి నుంచి సత్తెనపల్లికి ఇన్‌చార్జిని నియమించలేదు.



2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అనేక మంది కోడెల తనయుడు, కుమార్తె మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోపక్క స్థానిక నేతలు కొంతమంది కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. స్థానిక నాయకుల్ని బుజ్జగించే సమయంలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే నియోజకవర్గంలో రాయపాటి తనయుడు రాయపాటి రంగారావు కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.



కోడెల వ్యతిరేక వర్గం నేతలు రంగారావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలంటూ డిమాండ్ కూడా చేశారు. కోడెల మరణం తర్వాత ఆయన తనయుడు శివరాం అటు నర్సరావుపేట ఇటు సత్తెనపల్లిలో ఏదో ఒక నియోజకవర్గం ఇన్‌చార్జి పదవి ఆశించారు. నర్సరావుపేట నియోజవకర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన చదలవాడ అరవింద బాబు ఉండటంతో ఇక సత్తెనపల్లిపైనే శివరాం ఆశలు పెట్టుకున్నారు.



రాయపాటి, కోడెల వారసుల్లో ఎవరో ఒకరికి పదవి ఇస్తే మరొకరు వ్యతిరేకించే అవకాశం ఉండటంతో అధిష్టానం ఇన్‌చార్జిని నియమించకుండా తాత్సారం చేస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి. ఇదే క్రమంలో నియోజకవర్గంలో స్థానిక నేత అబ్బూరి మల్లి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాల్లో ముందంజలో ఉంటున్నారు. అంబటి వంటి నేతను తట్టుకొని పార్టీని బలోపేతం చేయాలంటే ఎవరో ఒకరిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసుల్లో ఎవరికి పదవి దక్కుతుందోనన్న చర్చ ఇప్పుడు కార్యకర్తల్లో జరుగుతోంది. మరి అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్‌ చేస్తుందో చూడాలి?