ఈసారికి వారసులకు నో ఛాన్స్.. ఆ తెలుగు యూత్ అధ్యక్షుడు ఎవరంటే?

  • Published By: sreehari ,Published On : July 29, 2020 / 03:03 PM IST
ఈసారికి వారసులకు నో ఛాన్స్.. ఆ తెలుగు యూత్ అధ్యక్షుడు ఎవరంటే?

యువత పునాదులుగా నిర్మితమైన పార్టీ అది. ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు యూత్‌ లీడర్లుగా ఉన్నవాళ్లే. అలా వాళ్లందర్నీ తీర్చిదిద్దిన ఫ్యాక్టరీగా మారింది ఆ పార్టీ. ఎప్పుడు ఆ పోస్ట్ కోసం యువరక్తం తహతహాలాడేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ మాత్రం అసలు సిసలు యువ నేత కోసం సెర్చింగ్‌ షురూ చేసింది.

వారసులు మాత్రమే యువ నాయకులా? :
యాత్‌ లీడర్ల ఫ్యాక్టరీగా పేరొందిన పార్టీ తెలుగుదేశం. 38ఏళ్ల కాలంలో ఎంతోమంది నేతల్ని తయారు చేసింది. వాళ్లంతా జాతీయ స్థాయి నేతలుగా కూడా ఎదిగారు. అలాంటి పార్టీలో ఇప్పుడు యువ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో పని చేసేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు.కేవలం సీనియర్ నేతల వారసులు మాత్రమే యువ నాయకులు అన్నట్టు.. వారికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. బహూశా ఈ కారణంతోనే పార్టీలో పనిచేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.


యూత్‌ని పట్టించుకోలేదనే ఆరోపణలు :
మొన్నటిదాకా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు దేవినేని అవినాష్. ఆయన వైసీపీలో చేరడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. నిజానికి టీడీపీలో యువత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వాళ్లందరికీ మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు యువతలో పనిచేస్తే అసెంబ్లీ టిక్కెట్ కూడా ఖాయమనే ప్రచారం కూడా ఉంది.

ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, అమర్నాథ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్, బీద రవిచంద్ర లాంటి వాళ్లు తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ యువతను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.

బాధ్యతలకు సిద్ధంగా ఉండాలని వాసుకి కబురు :
టీడీపీ అధిష్టానం పలు పేర్లను పరిశీలిస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు పేరు అప్పట్లో వినిపించింది. బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కూడా అధిష్టానం కబురు పంపిందట. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.


అదే సమయంలో పరిటాల శ్రీరామ్, చింతకాయల విజయ్‌ను పార్టీ సంప్రదించినట్టు తెలుస్తోంది. వీరు మాత్రం యువత బాధ్యత తీసుకునేందుకు ఆసక్తి చూపలేదట. ఇప్పటివరకూ టిడిపిలో జిల్లా కమిటీలు ఉండేవి. ఇకపై పార్లమెంటు వారీగా బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

చింతకాయల విజయ్ మాత్రం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తే అధ్యక్ష పదవి కావాలని కోరుతున్నారట. ఇప్పటికే విజయ్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. కరణం వెంకటేష్ పార్టీ వీడే వరకు ఆయన పేరు కూడా తెలుగు యువత రేసులో ప్రచారంలో ఉంది.

నారా లోకేష్‌తో బ్రహ్మంకు చౌదరి సంబంధాలు :
మొన్నటి వరకూ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గా పనిచేసిన నాదెళ్ల బ్రహ్మం చౌదరి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం, నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు.


ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరి దగ్గరికి వెళుతూ తెలుగు యువతకు తన పేరు రికమండ్ చేయమని కోరారట బ్రహ్మం చౌదరి. ఎస్సీ వర్గం నుంచి దివంగత నేత బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ పేరు కూడా వినపడుతుంది. ఎస్సీలు టీడీపీకి కొంత దూరం అయ్యారని హరీష్ కు యువత బాధ్యతలు అప్పగిస్తే ఆ వర్గాలని ఆకట్టుకోవచ్చని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు సలహా ఇచ్చారట.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి అయితే బాగుంటుందని మరికొందరు నేతలు అంటున్నారు. వారసుల పేర్లు మాత్రమే తెలుగు యువతకి పరిశీలించడంపై విమర్శలొస్తున్నాయి. ప్రతీ విషయంలో వారికే ప్రాధాన్యం ఇవ్వడంపై సామాన్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీంతో అధిష్టానం ఈసారి వారసుల్ని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందని సమాచారం. మరి ఈసారైనా సామాన్యూడికి పట్టం కడతారా చూడాలి.