వైసీపీలో ‘గంటా’ మోగనుందా?

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 11:23 AM IST
వైసీపీలో ‘గంటా’ మోగనుందా?

గంటా శ్రీనివాసరావు.. ఈ పేరు ఎన్నికలకు ముందు నుంచి ఏపీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండటమే ఆయనకు అలవాటనే టాక్ ఉండనే ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత గంటా శ్రీనివాసరావు టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో గంటాకు రాజధాని రూపంలో ఒక అవకాశం చిక్కిందంటున్నారు జనాలు.

గంట వ్యాఖ్యలపై పార్టీలో రచ్చ :
ఏపీకి మూడు రాజధానులుటే తప్పేంటని, కర్నూలులో జుడీషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అవకాశాలున్నాయంటూ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ పాయింట్ పట్టుకొని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు.. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించడాన్ని స్వాగతించారు. ఇది చాలా మంచి నిర్ణయమని గంటా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఒకపక్క, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అందరూ అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే.. గంటా మాత్రం జగన్ ప్రకటనను స్వాగతించడంతో పార్టీలో అసలు రచ్చ మొదలైంది.

విశాఖపట్నంలో ఇటీవల భారీగా భూములు కొంటున్నారని.. వింటున్నామని, దాని ఫలితంగానే ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయా అని చంద్రబాబు జగన్ను ప్రశ్నిస్తుంటే.. గంటా మాత్రం ఆహా ఓహో అని మొదలుపెట్టేశారు. వైసీపీలోకి వెళ్లాలంటే గంటాకు ఒక కారణం అవసరం. ప్రజలకు, కార్యకర్తలకు ఏదో ఒకటి చెప్పాలి. అలా కాకుండా నేరుగా వైసీపీలో చేరితే.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడే గంటా ఉంటారన్న వాదనలకు బలం చేకూర్చినట్టు అవుతుందని ఆయన భావించారట. అందుకే సరైన కారణం కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు.

ఈ సాకుతోనే పార్టీ మారుతారా? :
ఇప్పుడు విశాఖపట్నం రాజధానిని చేస్తారనే దానిని సాకుగా చూపించుకొని వైసీపీలోకి జంపై పోవచ్చనే ఆలోచనలో గంటా ఉన్నారని జనాలు అనుకుంటున్నారు. ఒకవేళ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించినందుకే వైసీపీలో చేరుతున్నట్టు గంటా చెప్పినా.. అది కాకుండా అంతకంటే ఎక్కువ ప్రయోజనం తప్పకుండా ఉంటుందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదం బయటకు కనిపిస్తున్నా గంటాకు ఈ ప్రాంతంలో భూములు కూడా విపరీతంగా ఉన్నాయని, అందుకే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. స్థానిక రాజకీయ ప్రయోజనాల కోసం గంటా ఈ తరహా ట్వీట్ చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు. కానీ, అసలైన ఆసక్తికర విషయం ఏంటంటే.. గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు ఇదొక సాకుగా మారుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

అవంతిని దాటి వెళ్లగలడా? :
గత కొంత కాలంగా గంటా వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీఎం జగన్ కూడా గంటాకు సిగ్నల్ ఇవ్వలేదట. అసెంబ్లీ సమావేశాలకు గంటా హాజరు కావడం, పార్టీ మారడం లేదని ఓ ప్రకటన చేయడంతో ఊహాగానాలకు తెరపడిందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ జగన్ నిర్ణయాన్ని ట్వీట్ ద్వారా స్వాగతించడంతో మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారానికి ఊపునిచ్చింది.

మరోపక్క, అవంతి శ్రీనివాస్ మాత్రం గంటాను రానిచ్చేలా కనిపించడం లేదు. తాజాగా గంటాను ఉద్దేశించి ఆయన చేసి ప్రకటనలే ఇందుకు బలం చేకూర్చుతోంది. గంటా అవకాశవాది అని, అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు చేరాలని ప్రయత్నిస్తారని అవంతి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో గంటా వైసీపీలో చేరాలంటే ఇంకెన్ని చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తారోనని జనాలు ఎదురు చూస్తున్నారు.