పవన్ కళ్యాణ్‌కి ఏమైంది? ఏపీకి ఎందుకు రావడం లేదు, తెలంగాణ పైనే ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు

  • Published By: naveen ,Published On : October 24, 2020 / 11:04 AM IST
పవన్ కళ్యాణ్‌కి ఏమైంది? ఏపీకి ఎందుకు రావడం లేదు, తెలంగాణ పైనే ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు

pawan kalyan: జనసేనాని పవన్ కల్యాన్‌ జనంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా తర్వాత అసలు ఆ దిశగా ఆలోచనే చేయడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తాయి. వరుసగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. అయినా పవన్‌ మాత్రం ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో జనసేన పార్టీలోనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అసలు పవన్‌ కల్యాణ్‌ ఏమీ మాట్లాడడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

తెలంగాణ అంశాలపై మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారు?
అసలు పవన్‌ కల్యాణ్‌ జనంలోకి వచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయితే.. తెలంగాణకు సాయం ప్రకటించి అండగా నేనున్నానని భరోసా ఇచ్చారు పవన్‌. కానీ, ఏపీలో పంటలు మునిగిపోయినా.. వరదలతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించేందుకు సిద్ధం కావడం లేదు. కనీసం సాయం చేస్తున్నట్టుగా ప్రకటన కూడా చేయలేదు. ఏపీ గురించి పట్టించుకోకుండా తెలంగాణ అంశాలపై మాత్రమే పవన్‌ ఎందుకు స్పందిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక ప్రత్యేక కారణాలున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.

హైదరాబాద్ కే ఎందుకు పరిమితం అయ్యారు?
గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలన్నీ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి సమస్యలపై పోరాడుతున్నారు. కానీ, పవన్‌ మాత్రం పూర్తిగా హైదరాబాద్‌కి పరిమితమవ్వడంతో.. అసలు అధినేత ఆంతర్యం ఏమిటో తెలుసుకొనేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారట. అప్పుడు వారికి కొన్ని విషయాలు తెలిశాయంటున్నారు.

జగన్ కన్నా కేసీఆర్ నయం:
అసలు పవన్‌ కల్యాన్‌ తెలంగాణలో స్పందిస్తూ.. ఏపీ గురించి పట్టించుకోకపోవడానికి పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. ఏపీలో ఏ అంశంపై స్పందించినా.. సీఎం జగన్‌ పట్టించుకోరని, కేసీఆర్‌లా జగన్‌ ప్రోయాక్టివ్‌ సీఎం కారని పవన్‌ భావిస్తున్నారు. ఏదైనా సమస్యపై ప్రశ్నించినా.. జగన్‌ నెగెటివ్‌గా తీసుకుంటారే తప్ప.. ఆలోచించే ప్రయత్నం చేయరన్నది పవన్‌ కల్యాణ్‌ మాట. అందుకే ఏపీ అంశాలపై అంతగా స్పందించడం లేదంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ ఫోకస్:
పవన్‌ చెప్పిన కారణాలు ఏవైనా.. మరో ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు పార్టీ నేతలు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే బీజేపీతో కలసి వెళ్తున్న జనసేన… తెలంగాణలోనూ కలసి సాగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలసి పోటీ చేసే దిశగా చర్చలు సాగుతున్నాయని టాక్‌. ఇప్పటికే జనసేన 50 డివిజన్లకు కమిటీలను కూడా నియమించింది. ఇక్కడి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్‌ కాన్‌సంట్రేట్‌ చేశారని అంటున్నారు.

పవన్ తీరుతో అయోమయంలో కార్యకర్తలు:
పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. ఏపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలో ఏమైనా సమస్యలుంటే గట్టిగా గళం విప్పే పవన్.. ఇప్పుడు నోరు మెడపకపోవడంతో విమర్శలు ఎదురవుతున్నాయి. సమస్యలపై పోరాడదామని భావిస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలకు తమ అధినేత తీరు అర్థం కాక, ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారట. జనసేనాని మళ్లీ జనంలోకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి, కేడర్ లో జోష్ నింపాలంటున్నారు జనసైనికులు. మరి పవన్‌ ఏం చేస్తారో చూడాలి.