ఏపీ రాజధాని అమరావతి విషయంలో సడెన్ గా సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్? కారణం అదేనా?

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 04:52 PM IST
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సడెన్ గా సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్? కారణం అదేనా?

pawan kalyan amaravati: ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన వైఖరి ఏంటన్నది అర్థం కావడం లేదంటున్నారు. జనసేనకు ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతికి మా మద్దతు ఉంటుంది, అమరావతి రైతుల తరఫున నిలబడతామని బలంగా చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పూర్తిగా ఉద్యమానికి దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

రాజధాని తరలిపోక తప్పదని పవన్‌ భావిస్తున్నారా:
జనసేన నేతలు విజయవాడలో ధర్నా నిర్వహించారే తప్ప రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి ఆ పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు కానీ వెళ్లకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం వారికి మద్దతుగా ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. నిన్న మొన్నటి వరకూ అమరావతి రైతులకు న్యాయం జరగాలని, జై అమరావతి అని తన స్టాండ్‌ను బలంగా వినిపించిన పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు మిన్నకుండిపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని తరలిపోక తప్పదని పవన్‌ భావిస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ కూడా సైలెంట్ అయిపోయింది:
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీఎం జగన్ ఢిల్లీ టూర్‌తో సీన్ మొత్తం రివర్స్ అయినట్టు భావిస్తున్నారు. అమిత్ షా, మోదీని జగన్ కలిసొచ్చిన తర్వాత ఏపీ బీజేపీలో పెద్దగా చలనం లేదు. అదే విధంగా బీజేపీ పార్టనర్ పవన్ కల్యాణ్ కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేదు. అమరావతి పేరుతో జరుగుతోన్న ఉద్యమం 300వ రోజుకి చేరుకున్న సమయంలో బీజేపీ కూడా సైలెంట్ అయిపోయింది. జనసేన కూడా బీజేపీ బాటలోనే పయనించింది. మూడు రాజధానుల విషయంలో జరుగుతున్న న్యాయ విచారణలో జనసేన కూడా భాగస్వామి అవుతుందని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా వెనకడుగేయడంపై చర్చ జరుగుతోంది.

అమరావతి గొడవ తనకెందుకని పవన్‌ సైలెంట్‌ అయిపోయారా?
గతంలో మందడంలో జరిగిన ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనసేనాని పవన్‌.. ఇప్పుడు పూర్తిగా నీరసపడ్డారు. మొన్న పులి చిన లాజరస్ అనే రైతు మరణంపై పవన్ చేసిన ట్వీట్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది లాజరస్‌ కుమార్తె. రాజకీయాలకు వాడుకొని వదిలేశారని మండిపడింది. దీంతో పవన్ కల్యాణ్‌కి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. దీనికి తోడు బీజేపీతో కలసి సాగుతున్న పవన్.. సొంతంగా స్టాండ్ తీసుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలీ అమరావతి గొడవ తనకెందుకని పవన్‌ సైలెంట్‌ అయిపోయారని రాజకీయ వర్గాల్లో టాక్‌. మరోపక్క, అమరావతి విషయంలో ఒక బీజేపీ, జనసేన కలసి రావనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.