ఏపీ శాసనసమండలి రద్దు కాబోతుందా ? బొత్స సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 08:58 AM IST
ఏపీ శాసనసమండలి రద్దు కాబోతుందా ? బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ శాసనమండలి రద్దు కాబోతుందా ? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుతోంది. అంతేగాకుండా..2020, జనవరి 23వ తేదీ గురువారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. పలు బిల్లులను సభ ఆమోదం పొందిన తర్వాత..స్పీకర్ తమ్మినేని..సీఎం జగన్ వైపు చూశారు. తర్వాత..20 నిమిషాల పాటు టీ బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మండలి రద్దుపై సభలో తీర్మానం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

మండలి రద్దు విషయంపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం జగన్. మండలిలో ప్రభుత్వానికి విలువ లేకుండా చేశారనే భావన ఎమ్మెల్యేల్లో ఉండడంతో రద్దుపై ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు కొంతమంది మంత్రులు…వారిస్తున్నట్లు టాక్. రాబోయే రోజుల్లో వైసీపీకి ఆధిక్యం వస్తుందని, రద్దు చేస్తే…రాజకీయకక్షతో చేశారనే భావన ప్రజల్లోకి వెళుతుందని, న్యాయపరమైన సమస్యలున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. మండలి రద్దు చేస్తే..అమలుకు సమయం పడుతుందని, దీనివల్ల ప్రయోజనం ఏంటనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే..మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుతున్నాయి. అనర్హత కలిగినటువంటి వ్యక్తులు..ఛైర్మన్ పదవిలో ఉన్నప్పుడు, ప్రభుత్వ విధానాలకు అడ్డుగా ఉన్న సమయంలో ఏం చేయాలనే దానిపై రాజ్యాంగ నిపుణులు అందరూ ఆలోచించాల్సన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మాత్రం పర్యావసనాలను ఆలోచించిన తర్వాతే..నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారాయన. 

అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA బిల్లు రద్దు మండలిలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతోంది ఏపీ ప్రభుత్వం. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ సమావేశమయిన సంగతి తెలిసిందే.

రద్దు చేసినా..కేంద్రం వెంటనే ఆమోదం ముద్ర వేసే అవకాశం లేదు. రద్దు చేస్తే..వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మండలి రద్దు చేసినా..తమకు ఎలాంటి సమస్య లేదని టీడీపీ అంటోంది. మరి రద్దు చేస్తారా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

Read More : ఛైర్మన్ చేసింది అనైతికం : ప్రజలు ఆశీర్వదిస్తే..మరో 50 ఏళ్లు మేమే – బొత్స