రాజకీయ ప్రయోజనం కోసం వినుకొండ వియ్యంకుల వ్యూహం, చంద్రబాబు నుంచి లభించేనా ఆమోదం

  • Published By: naveen ,Published On : October 29, 2020 / 05:33 PM IST
రాజకీయ ప్రయోజనం కోసం వినుకొండ వియ్యంకుల వ్యూహం, చంద్రబాబు నుంచి లభించేనా ఆమోదం

kommalapati sridhar: వినుకొండ మాజీ శాసనసభ్యుడు జీవీఎస్ ఆంజనేయులు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు వియ్యంకులు. గుంటూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన కుటుంబాలు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అభిమానులు కావటంతో చంద్రబాబు వీరిద్దరికీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. పార్టీ ఓటమి తర్వాత కొత్తగా నియమించిన కమిటీల్లో ఆంజనేయులును నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఇదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి శ్రీధర్‌ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్‌ కావాలని చూస్తున్నారని టాక్‌.

చక్రం తిప్పుతున్న ఆంజనేయులు:
2009, 2014 ఎన్నికల్లో వినుకొండ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆంజనేయులు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక కొమ్మాలపాటి శ్రీధర్ 2009, 2014 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలైనా పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆంజనేయులు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానం పార్టీ పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టింది. ఆంజనేయులుకు నరసారావుపేట పార్లమెంట్ జిల్లాకు అధ్యక్షునిగా నియమించింది.

రాజకీయ ప్రయోజనం కోసం ప్లాన్:
నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే పెదకూరపాడు సెగ్మెంట్‌ ఉంది. ఒకే జిల్లాలో ఇద్దరూ ఉండటం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదని భావించారో ఏమో తెలియదు కానీ కొమ్మాలపాటి శ్రీధర్ మరో నియోజకవర్గానికి మారాలని ప్లాన్‌ చేసుకుంటున్నారట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై ఆయన కన్నుపడిందని అంటున్నారు. గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిధిలోనే రాజధాని ఉంది. ఆ పరిధిలోనే కొమ్మాలపాటి రియల్‌ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్నారు. దీంతో వ్యాపార కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలంటే గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిధిలోని రాజకీయాల్లో ఉంటే మంచిదన్న అభిప్రాయంలో కొమ్మాలపాటి ఉన్నట్లు టాక్‌.

మద్దాలి గిరి స్థానంలోకి కొమ్మాలపాటి:
2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన మద్దాలి గిరి అధికార వైసీపీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు అవసరం ఉందని భావించిన శ్రీధర్‌.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పార్టీ కేడర్‌ను నడిపించేందుకు ఇప్పుడు అక్కడ సరైన నాయకులు లేరు. తాత్కాలికంగా స్ధానిక నాయకుడు కోవెలమూడి రవీంద్ర అలియాస్ నానికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే నాని వ్యవహార శైలిని సొంత పార్టీ నేతలే తప్పు పడుతుండటం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.

పశ్చిమ నియోజకవర్గంలో పాగా వేసేందుకు శ్రీధర్ పావులు:
తెరవెనక వైసీపీ నేతలతో వ్యాపార వ్యవహారాలు నడిపిస్తూ, తెరముందు టీడీపీ నేతగా చలామణి అవుతుండటాన్ని కరుడుగట్టిన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి నేతలంతా కొమ్మాలపాటికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇదే మంచి అవకాశంగా భావించిన కొమ్మాలపాటి.. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నట్లు టాక్‌.

తన స్వార్థం చూసుకున్న రాయపాటి:
కొమ్మాలపాటికి పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు రాజకీయ ఉద్దండుడు రాయపాటి సాంబశివరావు సైతం కొమ్మాలపాటికి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్టానానికి చెప్పారట. ఇందులో రాయపాటి స్వార్ధం కూడా ఉందంటున్నారు. పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి గుంటూరు పశ్చిమకు షిఫ్ట్‌ అయితే పెదకూరపాడులో తన కుమారుడు రంగారావుకు లైన్‌ క్లియర్‌ అవుతుందని భావిస్తున్నారని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. మరి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.