ఏపీలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందా? భారీ ఆశలు పెట్టుకున్న టీడీపీ

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 01:10 PM IST
ఏపీలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందా? భారీ ఆశలు పెట్టుకున్న టీడీపీ

dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి. అక్కడ వచ్చిన ఫలితాలను కూడా ఎవరి స్థాయిలో వారు విశ్లేషించుకుంటున్నారు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలోనే ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రజల్లో కూడా పాలక పక్షం పట్ల సానుకూల ధోరణి ఎక్కువగానే ఉంది.

జగన్ హామీలు తమకు ప్లస్ అవుతాయంటున్న టీడీపీ:
ఏపీ కన్నా తెలంగాణ ధనిక రాష్ట్రం కావడంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోంది. అయినా దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ ఓటమి చవిచూసింది. అదే ఏపీలో కూడా పునరావృతం అవుతుందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఏ నెలకి ఆ నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. మునుముందు ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతోందని టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఈ ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చాలా కష్టపడాల్సి వస్తుందని, అదే తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షం భావిస్తోంది.

ఏపీలో బీజేపీ బలపడతుందేమో అనే టెన్షన్:
మరోపక్క, దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో కానీ ఏపీలో టీడీపీ మాత్రం తెగ టెన్షన్ పడిపోతోందని అంటున్నారు. పైకి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్నప్పటికీ తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో ఏపీలో కూడా బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుందేమోనన్న ఆందోళనలో ఉందని చెబుతున్నారు. ఇదే అంశం టీడీపీని కలవరపెడుతోందని ఆ పార్టీలోనే కొందరు నేతలు గుసగుసలాడుతున్నారు.
https://10tv.in/p-gannavarm-mla-kondeti-chittibabu-pathetic-condition/
టీడీపీ నేతలను టార్గెట్ చేసినంతగా బీజేపీ నేతల జోలికి వెళ్లని వైసీపీ:
తెలంగాణలో ఊహించని విధంగా అనేక పోరాటాలు చేస్తూ బీజేపీ అక్కడి ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఈ క్రమంలో అదే తరహా వ్యూహంతో ఏపీలో కూడా వ్యవహరిస్తే మన పరిస్థితి ఏమిటా అని టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల విషయంలో బీజేపీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అధికార పార్టీపై గట్టి ఫైట్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి బాగా కలిసి వస్తోందనే అభిప్రాయాలున్నాయి. టీడీపీ నేతలను టార్గెట్ చేసినంతగా బీజేపీ నేతల జోలికి అధికార పార్టీ వెళ్లడం లేదంటున్నారు. అందుకే కొందరు టీడీపీ నేతలు తాత్కాలికంగా బీజేపీ పంచన చేరానని చెబుతున్నారు.



ఏపీలో బీజేపీ ఎదిగే అవకాశాలు:
మరోపక్క జగన్ సర్కార్ టీడీపీలో ఉండే కీలక నాయకులను టార్గెట్ చేస్తుండటంతో చాలామంది ఆ పార్టీని వీడి బయటకు వెళ్లిపోతున్న పరిస్థితులున్నాయి. గతంలో మాదిరిగా యాక్టివ్‌గా లేని పరిస్థితిలో టీడీపీ ఉండటంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఏపీలో ఆ పార్టీ నేతలు మరింత దూకుడుగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదట.

టీడీపీ అసంతృప్త నేతలకు బీజేపీ గాలం:
బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అసంతృప్త నేతలను బుట్టలో వేసుకునే పని ప్రారంభించిందట. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొందరు కీలక నేతలు బీజేపీలో చేరారు. ఆ తర్వాత చాలాకాలం టీడీపీ నేతలెవరూ కమలం పార్టీ వైపు చూడలేదు. కానీ మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రారంభమైందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ నాయకులపై ఇన్ని రోజులూ పెద్దగా దృష్టి పెట్టని కమలనాథులు ఇప్పుడు తమ రూటు మార్చారని చెబుతున్నారు. చాలామంది నేతలతో బీజేపీ పెద్దలు టచ్‌లోకి వెళ్తున్నారట.



ఎప్పుడు ఏ నేత బీజేపీలో చేరతాడోనని టీడీపీలో టెన్షన్:
రాబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే టీడీపీ మద్దతిస్తుందని ఒక ఫీలర్ వదిలారు. అయినా బీజేపీ హైకమాండ్ నుంచి సానుకూల స్పందన కనిపించ లేదట. ఈ నేపథ్యంలో పూర్తిగా బీజేపీపై టీడీపీ హైకమాండ్‌ ఆశలు వదిలేసుకుందని అంటున్నారు. తెలుగుదేశంలోని కీలక నేతలపై బీజేపీ దృష్టి పెట్టడంతో ఎప్పుడు ఏ నేత కమలం గూటికి చేరతారోననే ఆందోళనలో టీడీపీ ఉందని టాక్‌. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ వెనకే బీజేపీ తరుముకుంటూ వస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు.

టీడీపీ మరుగున పడిపోతే బీజేపీని ఈజీగా ఎదుర్కోవచ్చనేది వైసీపీ వ్యూహం:
అధికార వైసీపీ సైతం తమ గేమ్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపక్ష టీడీపీ చేసే కార్యక్రమాలని అణచివేస్తోందని అంటున్నారు. అదే విధంగా బీజేపీ కార్యక్రమాల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా సహకరిస్తుందనే అనుమానాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుందనే మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉందని చెబుతున్నారు. తద్వారా బలమైన టీడీపీ మరుగున పడిపోతే బీజేపీని ఈజీగా ఎదుర్కోవచ్చనేది వైసీపీ వ్యూహమని టీడీపీ నేతల చర్చల్లో వినిపిస్తోన్న వాదన.



ఇబ్బందికర పరిస్థితుల్లో టీడీపీ:
మరికొందరు టీడీపీ నేతలు మాత్రం నాయకులు కొద్దిమంది పార్టీ నుంచి జంపైపోయినంత మాత్రాన కేడర్‌ కూడా బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనుకోవడం కరెక్ట్‌ కాదంటున్నారు. గ్రామగ్రామాన బలమైన కేడర్ ఉన్న టీడీపీని తట్టుకొని ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకోవటం బీజేపీ అంత ఈజీ కాదని విశ్లేషించుకుంటున్నారు. ఓవరాల్‌గా ప్రస్తుతానికి టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అటు బీజేపీ హైకమాండ్.. ఇటు అధికార వైసీపీ సపోర్టుతో రాష్ట్ర బీజేపీ దూసుకుపోతే ఎలా అడుగులు వేయాలన్నదే ఇప్పుడు టీడీపీ నేతలను వేధిస్తోన్న ప్రశ్న అని చెబుతున్నారు.