Ganta Srinivasa Rao ఎమ్మెల్యేగా కొనసాగుతారా ? రాజీనామా చేస్తారా ?

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 07:30 AM IST
Ganta Srinivasa Rao ఎమ్మెల్యేగా కొనసాగుతారా ? రాజీనామా చేస్తారా ?

Ganta Srinivasa Rao : విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా? లేక రాజీనామా చేసి వైసీపీలో చేరతారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొన్ని గంటల్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం లభించనుంది.



YCP లోకి రావాలనుకునేవారు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేసి రావాలంటూ సీఎం జగన్ (CM Jagan) కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది నేతలు వైసీపీ వైపు వచ్చారు. ఇప్పుడు.. కూడా అదే రూల్ గంటా శ్రీనివాసరావుకు వర్తిస్తుందా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో.. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా స్పందించారు.



ఎవరైనా వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమన్నారు. జగన్మోహన్ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.



గంటా చేరికను మొన్నటి వరకు మంత్రి అవంతి శ్రీనివాస్ (Awanthi Srinivas) వ్యతిరేకించారనే ప్రచారం ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ చూస్తుంటే.. గంటా రావడం వైసీపీ విశాఖ నేతలకు సుతారమూ ఇష్టం లేనట్లుగా ఉందని విశ్లేషకులంటున్నారు. మరోవైపు… విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ కేకే రాజు పార్టీ అధినేత జగన్‌తో భేటీ అవుతారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా పాల్గొనే అవకాశం ఉంది.



గంటా పార్టీలోకి వస్తే.. తమ పరిస్థితి ఏంటా అని ఈ ఇద్దరూ నేతలూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. విజయసాయి, అవంతి, కేకే రాజు.. గంటా రాకకు ఒప్పుకున్నా… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక జగన్‌తో భేటీ తర్వాత తన కుమారుడిని వైసీపీలో జాయిన్ చేసి సైడై పోతారా? అన్నది మరో ప్రశ్న.



వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు కానీ పార్టీ కండువాలు కప్పుకోలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వారి కుటుంబ సభ్యులను మాత్రమే వైసీపీలో అధికారికంగా చేర్చి.. వీళ్లంతా మద్దతిస్తున్నారు. గంటా కూడా ఇలాగే చేస్తాడన్న అవకాశం లేకపోలేదు.