కూరగాయలు, పండ్ల మీద హెయిర్ డ్రయ్యర్ తో వేడిగాలి పడేలా చేస్తే కరోనా పోతుందా?

  • Published By: veegamteam ,Published On : April 17, 2020 / 02:18 AM IST
కూరగాయలు, పండ్ల మీద హెయిర్ డ్రయ్యర్ తో వేడిగాలి పడేలా చేస్తే కరోనా పోతుందా?

కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపించిది. అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా వైరస్ గురించి ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి. కరోనా ఎలా వచ్చింది? ఎలా వ్యాపిస్తుంది? దాన్ని నివారించడం ఎలా? సమాధానాలు లేని ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. దీనికి సంబంధించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక వ్యాక్సిన్ తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు సైంటిస్టులు. 

కూరగాయలు, పండ్లు, సరుకుల సంచుల మీద కరోనా వైరస్ ఉంటే ఇలా చేయండి:
కరోనాకు సంబంధించి అందరిని వేధిస్తున్న ధర్మ సందేహం ఒకటుంది. అదేమిటంటే.. బయటి నుంచి కొనుక్కొచ్చిన కూరగాయలు, పండ్లు, సరుకుల సంచుల మీద కరోనా వైరస్ ఉంటే ఏం చేయాలి? దాన్ని ఎలా చంపాలి అనేది సందేహం. వాటి మీద హెయిర్ డ్రయ్యర్ తో వేడి గాలి పడేలా చేస్తే కరోనా వైరస్ చనిపోతుందా? ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాని గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

ఇన్ ఫెక్షన్ ఉన్నవారు దగ్గినా, తుమ్మినా కూరగాయలకు, సంచులకు వైరస్ అంటుకునే అవకాశం:
కరోనా భయపెడుతున్న నేటి రోజుల్లో చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇన్ ఫెక్షన్ గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడిన తుంపర్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. తుంపర్లు కుర్చీలు, టేబుళ్ల వంటి వస్తువుల మీద పడితే, వాటిని తాకిన చేత్తో నోరు, ముక్కు, కళ్లను ముట్టుకున్నా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. కూరగాయలు, సరుకుల విషయంలో అనుమానాలు రావటానికి ఇదే కారణమవుతోంది. కూరగాయలు, పండ్లు, సరుకులు అమ్మేవారిలో ఇన్ ఫెక్షన్ గలవారు లేదా ఇన్ ఫెక్షన్ ఉన్నా లక్షణాలేవీ లేనివారు తగు జాగ్రత్తలు పాటించకుండా దగ్గినా, తుమ్మినా కూరగాయలకు, సంచులకు వైరస్ అంటుకునే అవకాశం లేకపోలేదు.

ఎండలో పెట్టినా, హెయిర్ డ్రయ్యర్ తో వేడిగాలిని కొట్టినా కరోనా చావదు:
ఈ అనుమానంతోనే కొందరు కూరగాయలను ఎండలో పెట్టటం, హెయిర్ డ్రయ్యర్ తో వేడిగాలిని కొట్టటం వంటివి చేస్తున్నారు. అయితే వీటితో ఎలాంటి ఉపయోగం లేదని సీనియర్ ఫిజీషియన్ డా.ఎంవీ రావు స్పష్టం చేశారు. వేడి వాతావరణంలోనూ వైరస్ బతికి ఉంటుండటమే దీనికి నిదర్శనం అన్నారాయన. కరోనా వైరస్ నివారణకు శుభ్రంగా కడగటం ఒక్కటే మార్గమని తెలుసుకోవాలని సూచించారు. నీటి ధార కింద కూరగాయలను కడిగితే ఇంకా మంచిదని చెప్పారు. నిజానికి వైరస్ ఉన్నా లేకపోయినా కూరగాయలు, పండ్ల మీద మట్టి, దుమ్ముధూళితో పాటు ఎరువులు, పురుగుమందుల అవశేషాలు ఉండొచ్చని, అందువల్ల నీటితో శుభ్రంగా కడుక్కోవాలని ఎంవీ రావు చెప్పారు.
 

కూరగాయలు కోసిన తర్వాత కాదు కోయక ముందే బాగా నీటితో కడగాలి:
కొందరు కూరగాయలు కోసిన తర్వాత కడుగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కోయకముందే కూరగాయలను కడగాలి. నీటిలో కాస్త పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం కలిపి కడిగితే పురుగు మందుల వంటివేవైనా ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఆ తర్వాత మంచి నీటితో కడగాకే వాడుకోవాలి. కూరగాయలను కడగటానికి ముందూ తర్వాతా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి కూరగాయలు తినకపోవటం మంచిది. బాగా ఉడికించే తినాలి. ఉడికించినప్పుడు ఆ వేడికి వైరస్, బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి.

సంచులను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ముంచి ఆరేయాలి:
ఇక సంచుల విషయానికి వస్తే.. ప్లాస్టిక్ మీద సుమారు 3 రోజుల వరకు వైరస్ ఉంటుంది. సబ్బుతో కడిగితే ఇది పోతుంది. అందువల్ల అనుమానముంటే వెంటనే సంచులను సబ్బుతో రుద్ది కడిగేయాలి. లేదా సోడియం హైపోక్లోరైట్ 1% ద్రావణంలో ముంచి ఆరేయొచ్చు. ఒక లీటరు నీటికి 7 గ్రాముల బ్లీచింగ్ పొడిని కలిపితే సోడియం హైపోక్లోరైట్ ద్రావణం తయారవుతుంది. ఇది వైరస్ నివారణకు బాగా పనిచేస్తుంది. తిరిగి వాడొద్దని అనుకుంటే ప్లాస్టిక్ సంచులను మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి. బట్ట సంచులైతే ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా ఉతుక్కుంటే సరిపోతుంది.