బాలయ్య కోరికను జగన్ తీరుస్తారా ?

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 01:44 PM IST
బాలయ్య కోరికను జగన్ తీరుస్తారా ?

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సీఎం జగన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారనే టాక్‌ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య సీఎం జగన్‌కు రెండు లేఖలు రాశారు బాలకృష్ణ. అందులో ఒకటి హిందూపురానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త జిల్లా కేంద్రం : –
దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేం లేదు. కాకపోతే అదే సమయంలో తన నియోజకవర్గమైన హిందూపురం పట్టణాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలయ్య కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం జగన్‌కు బాలయ్య లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అనంతలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు : –
అనంతపురం జిల్లాల్లో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. హిందూపురంను జిల్లాగా ప్రకటించినా జిల్లా కేంద్రంగా కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉండే హిందూపురాన్ని ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఉండవని భావిస్తున్నారు. ఎందుకంటే జిల్లా కేంద్రమంటే జిల్లాకు మధ్యలో ఉండాలన్నది ఉద్దేశం. కానీ, తమ ప్రాంత సెంటిమెంట్‌ను గమనించి బాలకృష్ణ ముందుగానే ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చి ఉంటారని అంటున్నారు.

పట్టణాన్నే జిల్లా కేంద్రం : –
ఏపీలోని లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్… జిల్లా కేంద్రాల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చినా నియోజకవర్గంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పట్టణాన్నే జిల్లా కేంద్రంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. హిందూపురం జిల్లా విషయంలో సీఎం జగన్‌ ముందు ప్రతిపాదన ఉంచిన బాలకృష్ణ… మరికొంతమంది నేతలకు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారని  భావిస్తున్నారు.

మలుగూరు వద్ద మెడికల్  కాలేజీ : –
సీఎం జగన్‌కు రాసిన లేఖలను ఫ్యాక్స్ ద్వారా సీఎంవోకు పంపించారు. జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలయ్య అందులో కోరారు. అటు హిందూపూరం పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో.. ఆ కాలేజీని హిందూపూర్ సమీపంలో మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని మరో లేఖలో కోరారు.

అదనంగా 12 కొత్త జిల్లాలు : –
ఇప్పుడు ఈ విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి.
ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలను విభజిస్తే సమస్యలు వస్తాయని అధికార పార్టీకి చెందిన నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ నిర్ణయం ?  : –
ఈ క్రమంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణను ఒక నటుడిగా అభిమానించే జగన్‌… రాజకీయపరంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఒక అభిమానిగా బాలయ్య కోరికను తీరుస్తారా? లేక తాను అనుకున్న విధంగానే నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.