Lockdown And Curfew : తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ..పొడిగిస్తారా ? నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్‌డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్. కనీసం రెండు వారాలు కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Lockdown And Curfew : తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ ..పొడిగిస్తారా ? నిర్ణయంపై ఉత్కంఠ

Telugu States

Telugu states : తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్‌డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్. కనీసం రెండు వారాలు కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్‌ అమలు చేస్తోంది ప్రభుత్వం. 2021, మే 30వ తేదీ ఆదివారంతో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. దీంతో మళ్లీ పొడిగించాలా.. వద్దా అన్నదానిపై కేబినెట్‌లో చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కరోనా కేసులు తగ్గిపోయాయి. ఈ నెల 12 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 8వేలు ఉండగా, మరణాల సంఖ్య 55 దాటింది. గత పది రోజులుగా 4 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య 20 కన్నా తక్కువగా ఉంటోంది. లాక్‌డౌన్ వల్లే కేసులు తగ్గాయని ప్రభుత్వం భావిస్తోంది. లాక్‌డౌన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్‌లో చర్చించారు కేసీఆర్. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలించారు. ప్రజల అభిప్రాయమూ సేకరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

లాక్‌డౌన్ కొనసాగిస్తే… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి కేబినెట్‌లో చర్చించనున్నారు. మరికొన్ని సడలింపులు ఇచ్చి.. లాక్‌డౌన్ కొనసాగించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ శాఖను లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముంది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంటలు వేయనుండడంతో… రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. మండల కేంద్రంలో ఎరువులను సిద్ధంగా ఉంచనుంది.

వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధంపై కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే రైతులు పండించిన ధాన్యంలో 70 శాతం కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నారు. మిగతా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు. లాభాలు వచ్చే పంటలు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సూచించింది. రైతుల సమస్యలు, లాక్‌డౌన్, కరోనా కట్టడిచర్యలతో పాటు…బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటివాటిపై కేబినెట్‌లోచర్చించనున్నారు.

అటు లాక్‌డౌన్ విధించకుండా… కర్ఫ్యూ ఆంక్షలతో కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్న ఏపీలో పరిస్థితిపై ఈ నెల 31న సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కర్ఫ్యూ పొడిగింపునకే సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు వారాలు కర్ఫ్యూను పొడిగించాలని సర్కార్ ఆలోచిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. రోజూ 15 వేల నుంచి 20 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ వంద మందికి పైగా చనిపోతున్నారు. దీంతో కర్ఫ్యూ కంటిన్యూ చేస్తూనే కరోనాను కట్టడి చేయగలమని అధికారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను కొనసాగిస్తారా… సడలింపు ఇస్తారా ? అన్నదానిపై రెండు రోజుల్లో ఓ స్పష్టత రానుంది.

Read More : CM KCR : త్వరలో రైతు బంధు, నకిలీ విత్తన తయారీదారులతో కుమ్మక్కైతే ఉద్యోగాల తొలగింపు