నామినేషన్ల ఫైనల్ లిస్ట్ : ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అంటే..

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 02:01 PM IST
నామినేషన్ల ఫైనల్ లిస్ట్ : ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అంటే..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 648 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 145 నామినేషన్లను తిరస్కరించారు. 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు 548 నామినేష్లన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3 వేల 925 నామినేన్లు వచ్చాయి.

నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో అత్యధికంగా 38 నామినేషన్లు రాగా చిత్తూరు లోక్ సభ నియోజకవర్గంలో 13 నామినేషన్లు వచ్చాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 15 నామినేషన్లకు తగ్గకుండా వచ్చాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 61 నామినేషన్లు వచ్చాయి. పాలకొండ మరియు పార్వతీపురం అసెంబ్లీ స్థానాలలో 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మంగళగిరిలో 50 నామినేషన్లు వచ్చాయి. 118 నియోజకవర్గాల్లో 15 కు తగ్గకుండా నామినేషన్లు వచ్చాయి. 

నిజామాబాద్ లో ప్రధాన పార్టీలకు రైతులు ఝలక్ ఇచ్చారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు 178 మంది రైతులు బరిలో ఉన్నారు. రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. చివరిరోజు నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ రైతుల నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆదిలాబాద్ 11, పెద్దపల్లి 17, నిజామాబాద్ 185, జహీరాబాద్ 12, మెదక్ 10, సికింద్రాబాద్ 28, హైదరాబాద్ 15, చేవెళ్ల 23, మల్కాజ్ గిరి 12, మహబూబ్ నగర్ 12, మహబూబాబాద్ 14, వరంగల్ 15, నాగర్ కర్నూల్ 11, ఖమ్మం 23, కరీంనగర్ 15, భువనగిరి 13, నల్లగొండ 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 23 న ఫలితాలు వెలువడనున్నాయి.