మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై – అనాధ శవాన్ని మోసిన శిరీష

మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై –  అనాధ శవాన్ని మోసిన శిరీష

woman sub-inspector who expressed her humanity in Srikakulam district : పోలీసులు అంటే సమాజంలో శాంతి భధ్రతల పరిరక్షణ కోసం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తుంటారు. కొందరు పోలీసులు సమాజంలో చెడ్డపేరు తెచ్చుకున్నా చాలామంది మానవత్వంతో వ్యవహరించే వారే ఉంటారు. అదే కోవకు చెందుతారు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఎస్సై శిరీష. పోలాల్లో చనిపోయి ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని మోసుకువచ్చి స్వఛ్ఛంద సంస్ధ ద్వారా దహన సంస్కారుల జరిపించి మానవత్వం చాటుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని ఒకటో వార్టులో ఉన్న అడవి కొత్తూరులో పొలాల్లో గుర్తు తెలియని శవాన్ని స్ధానికులు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు చెప్పారు, కాశీబుగ్గ ఎస్సై కొత్త శిరీష సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. వివరాలు తెలుసుకుని శవాన్ని బయటకు తీసుకురావాలని స్ధానికులను కోరారు.

శవాన్ని మోసుకెళ్లటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో తానే ముందడుగు వేసి, స్ధానికుల్లో ఒకరిని మరోవైపు పట్టుకోమవి కోరారు. అతని సాయంతో దాదాపు కిలోమీటరు మీర శవాన్ని మోసుకుంటూ వచ్చి లలితా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి అనాధ శవాన్ని అప్పగించారు.

వారి ద్వారా గుర్తు తెలియని శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ సమాచారం తెలుసుకున్న డీజీపీ గౌతం సవాంగ్ విధినిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న కాశీబుగ్గ మహాళా ఎస్సై శిరీషను ఫోన్ చేసి అభినందించారు.