Women Movement : సారా రక్కసిపై మహిళల తిరుగుబాటు

అదో మారుమూల గ్రామం.. ఓ పక్క కరోనాతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరో ప్రధాన సమస్య వారిని పట్టి పీడిస్తోంది. కరోనాకు తోడు ఎంతోమంది సారాకు బానిసలై జీవితాలను కోల్పోతున్నారు.

Women Movement : సారా రక్కసిపై మహిళల తిరుగుబాటు

Women Movement

Women movement against alcohol sales : అదో మారుమూల గ్రామం.. ఓ పక్క కరోనాతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరో ప్రధాన సమస్య వారిని పట్టి పీడిస్తోంది. కరోనాకు తోడు ఎంతోమంది సారాకు బానిసలై జీవితాలను కోల్పోతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. దీంతో.. ఇక లాభం లేదనుకున్నారు ఆ ఊరి మహిళలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడటం కంటే.. తామే సారా మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించారు. మరి ఇంతకీ ఆ మహిళలు చేసిందేంటి..?

ఇదే విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని గోచెక్క గ్రామం. ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న ఈ ఊరిని.. సారాయి రక్కసి పట్టి పీడిస్తోంది. దీంతో ఆ ఊరి మహిళలంతా ఒక్కటయ్యారు. సారా మహమ్మారిపై పోరాటం మొదలెట్టారు. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో నాటు సారా ఏరులై పారుతోంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో.. చీప్‌గా దొరికే నాటుసారా వైపు మళ్లారు మద్యంప్రియులు. దీనిని అవకాశంగా మలచుకున్న కొందరు.. విచ్చలవిడిగా నాటుసారాను తయారు చేసి అటు ఒడిశా, ఇటు ఏపీకి దొంగ రవాణా చేస్తూ కాసులు దండుకుంటున్నారు.

నాటుసారాతో ఆ ప్రాంతంలోని గోచెక్క గ్రామమ యువత జీవితాలు చిధ్రమవుతున్నాయి. మహిళలు ఎంత వారించినా.. నాటుసారా విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు పడుతుండగా.. సారా మత్తు వారి బతుకులను మరింత కృంగదీస్తోంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల మహిళలు సారాపై ఉద్యమానికి నడుం బిగించారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నాటుసారా స్థావరాలపై మహిళలు పెద్ద ఎత్తున దాడులు చేసి, వాటిని ధ్వంసం చేశారు.

గోచెక్కతో పాటు దళాయిపేట, గేదెలవలస తదితర ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై పెద్ద ఎత్తున మహిళలు దాడులు చేశారు. రవాణాకు సిద్ధంగా ఉన్న సారా క్యాన్లను స్వాధీనం చేసుకొని, మూకుమ్మడిగా తగలబెట్టారు. అయితే, పోలీసులు, ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహంతోనే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నాటుసారా స్థావరాలు వెలుస్తున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

గోచెక్క మహిళలను మిగిలిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమలో ఉండకుండా.. సమస్యపై ఎవరికి వారే పోరాడాలనే విషయాన్ని ఆ గ్రామ మహిళలు అందరికీ నూరిపోస్తున్నారు.