విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె!

Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. ఈరోజు ఏపీలో అమ్ముతున్నారు..రేపు తెలంగాణలో అమ్మడం మొదలుపెడతారని తెలిపారు.

కేంద్రం వైఖరికి నిరసనగా అవసరమైతే విశాఖలో పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అందరూ పోరాడాలని పిలుపిచ్చారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే తమకు సంబంధం ఏంటి అనుకోమని తెలిపారు. ఇప్పుడు తాము పట్టించుకోకపోతే తెల్లారి మన దగ్గరకు వస్తారని చెప్పారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన చేపట్టారు. విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం సర్కిల్ వద్ద ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటికరణపై వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు నిన్న లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో ఉక్కు కార్మికులు-నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. స్టీల్‌ ప్లాంట్ ఎదుట హై టెన్షన్ నెలకొంది. నిన్న స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ భవన్‌ను కార్మికులు ముట్టడించారు. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్‌ డైరెక్టర్‌ను అడ్డుకున్నారు.

కారు ముందు బైఠాయించి ఘెరావ్ చేయడంతో.. పోలీసు భద్రత నడుమ ఆయన వెనక్కు వెళ్లిపోయారు. కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ముట్టడితో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. పరిపాలనా భవనం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.