ఒకటంటే రెండంటాం : పవన్‌కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 01:01 AM IST
ఒకటంటే రెండంటాం : పవన్‌కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి.. ద్వారంపూడి అనుచరుల చేతిలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం.. ఫ్యాక్షన్ సంస్కృతి నడుస్తోందని మండిపడ్డారు. అధికారం ఎల్లవేళలా ఉండదని.. గుర్తుంచుకోవాలన్నారు. పవన్‌ వ్యాఖ్యలకు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కౌంటరిచ్చారు. తమ కార్యకర్తలు, తన ఇంటిపై ప్లాన్‌ ప్రకారమే జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా కోసం వచ్చి దాడులు చేయడం కరెక్టేనా అని పవన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ భాష మార్చుకోవాలని… మీరు ఒక్క మాట అంటే మేం రెండు అంటామని ద్వారంపూడి హెచ్చరించారు.

ఢిల్లీ నుంచి.. విశాఖలో దిగిన పవన్.. 2020, జనవరి 14వ తేదీ మంగళవారం రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు వచ్చారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కొంతమంది మదమెక్కిన నేతలు.. అసభ్యంగా మాట్లాడుతున్నారని పవన్‌ మండిపడ్డారు. అసభ్యంగా మాట్లాడి.. గొడవలు జరగడానికి కారణమైన ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరని హెచ్చరించారు. మరోసారి దాడుల ఘటనలు జరిగితే.. చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించారని.. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

పవన్ కల్యాణ్ కాకినాడ వస్తున్న సందర్భంగా పెద్దఎత్తున అభిమానులు వచ్చారు. ద్వారంపూడిని టార్గెట్ చేసి.. పవన్ కల్యాణ్ ఢిల్లీలో మాట్లాడటం.. కాకినాడలోనే తేల్చుకుంటామని ప్రకటించడంతో.. పోలీసులు ముందస్తు చర్యగా.. 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. ద్వారంపూడి ఇంటి వద్ద రెండు, మూడు వందల మంది పోలీసుల్ని మోహరించారు. 

Read More : రాజధాని రచ్చ : పండుగపూట పోరుబాట