ప్రేమ మోజులో కాబోయే భర్తను, ప్రియుడితో హత్య చేయించిన యువతి

ప్రేమ మోజులో కాబోయే భర్తను, ప్రియుడితో హత్య చేయించిన యువతి

young girl assasinated her husband help with lover, kurnool : కాలేజీ చదివే రోజుల్లో ఏర్పడే పరిచయాలు, ప్రేమలు శాశ్వతం అనుకుని కాబోయే భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించిన యువతి ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఆళ్లగడ్డకు చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ సెకండియర్‌ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. కూతురు ప్రేమ విషయం గమనించిన కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ ఆమెలో ఏమాత్రమూ మార్పు రాలేదు.

ఈ పరిస్ధితుల్లో తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్‌ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రమూ ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌ వేశారు. ఇందుకోసం మరో ముగ్గురి సహాయం తీసుకున్నారు.

ప్రేమగా ఇంటికి రమ్మని నమ్మ బలికింది
కాబోయే భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకున్న యువతి….తన కుటుంబ సభ్యులకు, కాబోయే భర్తకు ఏమాత్రమూ అనుమానం రాకుండా గత పది రోజులుగా, రోజూ అతనితో ఫోన్‌లో మాట్లాడటం మొదలెట్టింది. కాబోయే భార్య ఫ్రేమగా రోజు మాట్లాడుతుంటే గఫార్ బేగ్ కూడా ఉత్సాహంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఒక రోజు ఇంటికి రమ్మని కోరేది. అందులో భాగంగా శనివారం బాచ్చాపురంలో గడేకారి పనికి పోయిన గఫార్‌బేగ్‌కు ఫోన్‌ చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేరు. నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంటికి రా’ అంటూ ప్రేమగా పిలిచింది. ఫోన్ చేసినప్పుడల్లా రమ్మని అడుగుతోంది కదా అని ….. అతను స్వీట్లు, పండ్లు తీసుకుని కాబోయే అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ ఆమెతో సుమారు రెండు గంటలు గడిపాడు. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దగ్గర వాళ్లు ఎదురు చూస్తుంటారని తన మోటార్‌ బైక్‌పై గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ప్లాన్ ఇలా అమలు చేశారు.
ఆమె ప్లాన్ లో భాగంగా…. తన ప్రియుడిని ముందుగానే కోటకందుకూరు సమీపంలోకి వెళ్లి సిద్ధంగా ఉండాలని , అతనికో తోడుగా మరో యువకుడిని బైక్‌పై పంపించింది. భర్త ఏ దారిలో వెళ్తున్నాడో తెలుసుకోటానికి మరో ఇద్దరిని ఇంకో బైకుపై అతన్ని అనుసరించేలా పంపించింది. నిమిష నిమిషానికి ఫోనులో వారి ద్వారా సమాచారం తెలుసుకుంది. గఫార్‌బేగ్‌ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపుకాసిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి అతడిపై దాడి చేశారు. అంతలోపే అతడ్ని అనుసరించి వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి నలుగురు కత్తులతో పొడిచి చంపారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

కాగా..కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వెళ్లిన పోలీసులకు….అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించి….అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీఎస్పీ రాజేంద్ర ఆదేశాల మేరకు మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం బయట పడేసరికి షాక్ అయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సీఐ సుదర్శన ప్రసాద్‌ మాట్లాడుతూ అనుమానితులను విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.