ప్రాణం తీసిన కబడ్డీ : ఆటలో కుప్పకూలిన యువకుడు

ప్రాణం తీసిన కబడ్డీ : ఆటలో కుప్పకూలిన యువకుడు

Kabaddi In Kadapa District : భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ చూశారా?.. హీరో నాని ఆటలోనే ప్రాణాలు కోల్పోతాడు. కబడ్డీ ఆడుతూ తుదిశ్వాస విడుస్తాడు. సినిమా స్టోరీలోని హీరో చనిపోవడంలానే నిజంగా జరిగింది. కడప జిల్లా వల్లూరు మండలం గంగన్నపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి జరిగింది. కూతకు వచ్చిన యువకుడు తిరిగి వెళుతూ. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలేశాడు.

కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేటకు చెందిన నరేంద్ర ఎం.కామ్ చదివాడు. అతనికి కబడ్డీ అంటే ప్రాణం. గంగన్నపల్లిలో ప్రభుత్వ అధికారులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండటంతో ఉత్సాహంగా నరేంద్ర పాల్గొన్నారు. ఆటలో కూతకు వెళ్లిన అతడిని.. ప్రత్యర్థి జట్టు సభ్యులు ఒక్కసారిగా పట్టుకుని కింద పడేశారు. కూతకు వెళ్లిన నరేంద్రను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఒడిసిపట్టుకున్నారు. ఆ సమయంలో నరేంద్ర కూత ఆపేయడంతో.. అంతా వదిలిపెట్టేశారు. కాని అక్కడ జరిగిన ఘటన వేరు. నరేంద్ర కూత ఆపేసింది ఆటలో కాదు.. నిజజీవితంలోనే.

అనంతరం పైకి లేచిన యువకుడు నరేంద్ర రెండు అడుగులు వేసిన వెంటనే కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఆటగాళ్లు నరేంద్రను పైకి లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతడు ప్రాణాలు వదిలాడు. అయితే నరేంద్రను కాపాడుకునేందుకు కడప రిమ్స్‌కు తరలించారు. కాని డాక్టర్లు పరిశీలించి చనిపోయి చాలా సమయం అయిందని ప్రకటించారు. పోటీలకు వెళ్తున్నా అమ్మ తప్పకుండా గెలిచే వస్తా అని తన కొడుకు చెప్పిన మాటలే ఆఖరి మాటలయ్యాయని నరేంద్ర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.