వైఎస్ ఫ్యామిలీ : పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 04:11 PM IST
వైఎస్ ఫ్యామిలీ : పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం.. పాదయాత్రల ముగింపునకు వేదికగా మారింది. యాత్ర ఎక్కడ ప్రారంభమైనా ముగింపు మాత్రం ఇచ్చాపురమే అవుతోంది. ఏపీలో ఇప్పటి వరకు నాలుగు పాదయాత్రలు జరిగితే.. మూడు యాత్రలు ఇక్కడే ముగిశాయి. ఆ మూడూ వైఎస్ కుటుంబీకులవే కావడం విశేషం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 2003 ఏప్రిల్ 9వ తేదీన చేవెళ్లలో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 68రోజుల పాటు 1470కిలోమీటర్ల మేర నడిచిన తరువాత.. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రకు ముగింపు పలికారు. ప్రజాప్రస్థానానికి గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన 2004 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. స్పాట్… విజువల్స్….

2012లో వైఎస్ కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 18 ఇడుపుల పాయ నుండి ప్రారంభమైన యాత్ర ఆగస్టు 4, 2013న ఇచ్చాపురంలో ముగిసింది.
230 రోజుల పాటు 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల్లో సాగిన మరో ప్రజా ప్రస్థానం 3112 కిలోమీటర్ల మేర సాగి.. ఇచ్చాపురంలో ముగిసింది. షర్మిల కూడా మరో ప్రజాప్రస్థానానికి గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2017 నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. 341 రోజుల పాటు 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరంతో సమానం. జనవరి 9 2019న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. ప్రజాసంకల్ప యాత్ర చిరస్థాయిగా నిలిచేందుకు వైసీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. విజయస్థూపం పేరుతో 88 అడుగుల భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశాయి.

88 అడుగుల విజయస్థూపంలో వైఎస్ ఫ్యామిలీకి చెందిన ఫోటోలను ఉంచారు. పునాది నుంచి స్థూపం బేస్‌ వరకూ 13జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉండగా… మొదటి అంతస్తులో జగన్‌ పాదయాత్ర ఫొటోలు,. రెండో అంతస్తులో వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటోలను ఉంచారు. స్తూపంలోని వృత్తాకార ఆకృతిలో వుండే చివరి అంతస్తు నుంచి 15 అడుగుల ఎత్తులో వైసీపీ జెండాను ఉంచారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్రహరీగోడపైన జగన్ పాదయాత్ర ఫోటోలతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.