సీట్ల కోసం పోటీ : మోహన్‌బాబూ అడిగారట ఓ చాన్స్‌!

  • Published By: sreehari ,Published On : March 7, 2020 / 02:07 PM IST
సీట్ల కోసం పోటీ : మోహన్‌బాబూ అడిగారట ఓ చాన్స్‌!

ఏపీలో రాజ్యసభ ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను అధికార వైసీపీయే సొంతం చేసుకొనే అవకాశాలు ఉండడంతో వేరే పార్టీల ప్రభావం కనిపించడం లేదు. నాలుగు స్థానాల కోసం పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. కాకపోతే వైసీపీ అధినేత జగన్‌ జాగ్రత్తగా డీల్ చేసి ముగ్గురు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండలి రద్దు అయితే పదవులు కోల్పోయే అవకాశం ఉన్న మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లకు పక్కాగా రాజ్యసభకు పంపించాలని జగన్‌ ఫిక్సయిపోయారట. మరో స్థానాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్యరామిరెడ్డికి ఖరారు చేసేశారని అంటున్నారు. 

నాల్గో స్థానంపైనే అందరి చూపు :
ముగ్గురు అభ్యర్థిత్వాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన జగన్‌.. నాలుగో స్థానంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఆ స్థానాన్ని ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పరిమళ్‌ నత్వానీ ఆశిస్తున్నారు. ఆయనకు ఓ సీటు కేటాయించాల్సిందిగా ఇటీవల జగన్‌ను కలిసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరారు. ఈ విషయంలో జగన్‌ సుముఖంగానే ఉన్నా ఇక ఒక నిర్ణయానికైతే రాలేదంటున్నారు. నత్వానీతో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో సినీ నటుడు మోహన్‌బాబు కూడా రాజ్యసభ ఆశిస్తున్నారనే ప్రచారం మొదలైంది. కాకపోతే జగన్‌ మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదంటున్నారు. 

మోహన్ బాబుకు బలమెంత? :
మోహన్‌బాబు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పట్లో ఆ ఆరేళ్ల పదవీ కాలం తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలు మారాయి. అప్పుడు ఆయనకు కొనసాగింపు కూడా లభించలేదు. పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా వ్యవహరించిన సందర్భాలూ లేవు. గత ఎన్నికల ముందు మాత్రం వైసీపీలో చేరి కాస్త హడావుడి చేశారు. కాకపోతే రాజకీయంగా మోహన్ బాబుకు ఉన్న బలం ఎంత అనేది ప్రశ్నార్థకమే. వైఎస్ కుటుంబంతో ఆయనకు వియ్యం ఉండడమొక్క కారణం తప్ప ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నది వైసీపీ నేతల్లో టాక్‌. 

అంబానీ సూచించిన నత్వానీకి ఇస్తారా? :
ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా మోహన్‌బాబు కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ ఒక ప్రచారం మొదలైంది. ఏపీలో బలపడాలని బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో మోహన్‌బాబు ఆ పార్టీలోకి చేరతారేమో అన్న ఊహాగానాలు సాగాయి. అయితే అవేవీ జరగలేదు. ఇప్పుడు వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆశించారని ప్రచారం జరుగుతున్నా.. అలాంటి అవకాశాలేవీ లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ విషయం పక్కన పెడితే మిగిలిన ఒక్క స్థానం కోసం వైసీపీలో తీవ్రమైన పోటీ ఉంది. కాకపోతే ఆ స్థానాన్ని అంబానీ ప్రతిపాదించిన నత్వానీకి ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే రాష్ట్రానికి రిలయన్స్‌ తరఫున పెట్టుబడులు వస్తాయన్నది వైసీపీ నేతల వాదనగా ఉంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా పేర్లను ప్రకటిస్తారని భావిస్తున్నారు. మరి జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు.