సీఎం జగన్ పోలవరం బాట

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 06:36 AM IST
సీఎం జగన్ పోలవరం బాట

YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్‌ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. ముందుగా ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు సైట్‌లోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రోజెక్టును ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించింది.

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం :-
పనులు శరవేగంగా జరిగే విధంగా చూస్తోంది. 2021 డిసెంబర్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి నీరు అందించే లక్ష్యంతో పనులను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పనుల్లో మరింత వేగం పెంచేందుకు సీఎం జగన్ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇటీవల పోలవరం అంచనాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 2014 అంచనాలకు అంగీకరించడం వల్లనే కొత్త అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలు పెడుతుందని ప్రభుత్వం చెబుతుంది. దీనికి టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం :-
ప్రభుత్వ చేతకాని తనం వల్లే పోలవరం నిధులు తెచ్చుకోలేకపోతున్నారని ఆరోపించింది. ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రతిపక్షం మీదకు నెడుతోందని విమర్శించింది. నిధులేకాదు… పోలవరం ఎత్తుపైనా ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తే ప్రభుత్వం మాత్రం ఇంచు ఎత్తుకూడా తగ్గదని స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టు కొత్త అంచనాలు ఆమోదించాలని కోరారు. అంతేకాదు…. ప్రాజెక్టు పనులు పరిశీలించాలని కూడా ఆహ్వానం పలికారు. దీంతో త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రి పోలవరం పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచేందుకు స్వయంగా సీఎం జగన్‌ క్షేత్రస్థాయి పర్యటన చెస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పోలవరంపై రాజకీయవేడి కొనసాగుతున్న నేపథ్యంలో… జగన్‌ టూర్‌ ఆసక్తి కరంగా మారింది.