YS Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసు.. 4గంటలకు పైగా ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

YS Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసు.. 4గంటలకు పైగా ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ తొలి రోజు ముగిసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి వెల్లడించారు. విచారణలో చెప్పిన విషయాలను వక్రీకరించకూడదనే లాయర్ సమక్షంలో విచారించాలని కోరానని, అయితే అందుకు అధికారులు అంగీకరించలేదని చెప్పారు. సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు అవినాశ్ రెడ్డి. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా దర్యాఫ్తు కోసం వచ్చిన రాం సింగ్ బృందం.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. నలుగురు సభ్యుల బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు.

”అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారు. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో సీబీఐకి సహకరిస్తా. నాకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నా. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని కోరగా అందుకు వారు అంగీకరించలేదు” అని అవినాష్ రెడ్డి వెల్లడించారు.

Also Read..YS Viveka Murder Case : అవినాశ్‌రెడ్డి లాయర్ ను కార్యాలయం బయటే ఆపివేసిన సీబీఐ అధికారులు..

ఇక, విచారణకు హాజరయ్యే ముందు.. సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు.

తప్పుదోవ పట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగ్ కు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని అవినాశ్ రెడ్డి కోరారు.

Also Read..YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం

వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు సైతం జారీ చేసింది. విచారణకు హాజరుకావాలంది. వివేకా హత్యకేసులో ఆరోపణలు రావడంతో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.